ఛోటా రాజన్‌కు జైలు శిక్ష

25 Apr, 2017 16:28 IST|Sakshi
ఛోటా రాజన్‌కు జైలు శిక్ష

న్యూఢిల్లీ: నకిలీ పాస్ట్ పోర్ట్‌ కేసులో గ్యాంగ్‌స్టర్‌ ఛోటా రాజన్‌తో పాటు మరో ముగ్గురికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. సోమవారం వీరిని దోషులుగా నిర్ధారించిన ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు (మంగళవారం) శిక్షలను ఖరారు చేసింది. వీరికి జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వీరేందర్ కుమార్‌ గోయల్‌ తీర్పు చెప్పారు.

ఫోర్జరీ పత్రాలతో మారుపేరుతో ఛోటా రాజన్‌ పాస్‌ పోర్టు పొందినట్టు గతేడాది జూన్‌ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. రాజన్‌తో పాటు పాస్‌ పోర్టు అధికారులు జయశ్రీ దత్తాత్రేయ్‌ రహతె, దీపక్‌ నట్వర్‌లాల్‌ షా, లలిత లక్ష్మణన్‌లపై కేసు నమోదైంది. 1998-99లో బెంగళూరులో ఛోటా రాజన్‌.. మోహన్‌ కుమార్‌ అనే పేరుతో నకిలీ పాస్‌ పోర్టు పొందాడని, ఇందుకు పాస్ట్‌ పోర్టు అధికారులు సహకరించారని సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. నేరం రుజువు కావడంతో రాజన్‌తో పాటు అతనికి సహకరించిన వారికి శిక్ష పడింది. 2015 అక్టోబర్‌లో ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డ రాజన్‌ను ఆ ఏడాది నవంబర్‌లో భారత్‌కు అప్పగించారు.

మరిన్ని వార్తలు