ఛోటారాజన్ ల్యాప్‌టాప్‌లో దావూద్ గుట్టు!

2 Nov, 2015 12:33 IST|Sakshi
ఛోటారాజన్ ల్యాప్‌టాప్‌లో దావూద్ గుట్టు!

బాలి (ఇండోనేషియా): అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్‌లో 'డీ' గ్యాంగ్ అధినేత దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన కీలక సమాచారం ఉండే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఛోటా రాజన్‌ను భారత్‌కు రప్పించేందుకు సీబీఐ అధికారులు మలేషియా రాజధాని బాలి చేరుకున్నారు. బాలి పోలీసుల అదుపులో ఉన్న ఛోటా రాజన్‌ ల్యాప్‌టాప్‌, మొబైల్ ఫోన్‌ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని త్వరలోనే భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారం మేరకు ఛోటా రాజన్‌ను బాలి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే అతని వద్ద నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో తన గ్యాంగ్‌తోపాటు 'డీ' గ్యాంగ్‌కు సంబంధించిన కీలక సమాచారం ఉండే అవకాశముందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్‌ గ్యాంగ్‌ల మధ్య బద్ధ విరోధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛోటా రాజన్ ల్యాప్‌టాప్, మొబైల్‌లో దావూద్‌ గ్యాంగ్ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం దొరకవచ్చునని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఛోటా రాజన్‌ ముంబైకి తరలించి.. నగరంలోని ప్రధాన పోలీసు కార్యాలయంలో విచారించనున్న నేపథ్యంలో ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

 

మరిన్ని వార్తలు