‘అది తమిళనాడు నుంచే లీకైంది’

30 May, 2017 08:36 IST|Sakshi
‘అది తమిళనాడు నుంచే లీకైంది’

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విదేశీ పెట్టుబడుల ప్రమోషన్‌ బోర్డు(ఎఫ్‌ఐపీబీ)లో భాగమైన ఆరుగురు కార్యదర్శులను తమ కుటుంబంలోని సభ్యులు ప్రభావితం చేశారనడం ‘అర్థరహితం’అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం పేర్కొన్నారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు ఎఫ్‌ఐపీబీలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సోమవారం మీడియాతో మాట్లాడిన చిదంబరం ఈ ఆరోపణలను కొట్టివేశారు.

కొందరు పనిలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తమ కుటుంబంలోని ఎవరూ ఎఫ్‌ఐపీబీని ప్రభావితం చేసే అవకాశమే లేదని, ఆరుగురితో కూడిన బోర్డు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఏ ఒక్క అధికారీ సొంతంగా నిర్ణయం తీసుకోలేరన్నారు. ఎఫ్‌ఐపీబీ సిఫార్సు చేసిన వాటికి మాత్రమే తాను అనుమతి ఇచ్చానని, తన హయాంలో బోర్డులో పనిచేసిన కార్యదర్శులంతా ఎంతో అనుభవం ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌లని.. ఒక్కరు మాత్రం ఐఎఫ్‌ఎస్‌ అధికారని వివరించారు.

‘‘నా నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు ఏ అధికారి ధైర్యం చేసేవారు కాదు. మా కుటుంబ సభ్యులైనా కూడా అధికారులతో మాట్లాడేందుకు అనుమతించేవాడిని కాద’’ని పేర్కొన్నారు. అక్రమంగా నగదు బదిలీలో భాగంగా పక్షం రోజుల క్రితం సీబీఐ.. కార్తి, ఐఎన్‌ఎక్స్‌ మీడియా వ్యవస్థాపకురాలు ఇంద్రాని, పీటర్‌ ముఖర్జీ నేరపూరిత కుట్ర కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం విదితమే.


దీనిపై చిదంబరం స్పందిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌లో తన పేరును చేర్చనప్పటికీ, ఎఫ్‌ఐపీబీని చేర్చడంతో నాటి ఆర్థిక మంత్రిగా తననూ టార్గెట్‌ చేసినట్లేనని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీ అనుకోకుండా తనకు సోషల్‌ మీడియా ద్వారా లభించిందని, ఇది లీక్‌ అయింది కూడా తమిళనాడు నుంచే అని వెల్లడించారు. అందులో ఉన్న ఆరోపణలన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కార్తిపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఎం/ఎస్‌ ఎడ్వాంటేజ్‌ స్ట్రాటిజిక్‌ కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఏఎస్‌సీపీఎల్‌)లో అతడు డైరెక్టర్‌ కాదని, కనీసం వాటాదారుడు కూడా కాదన్నారు. ఆ కంపెనీ తన కుమారుడి స్నేహితులదని, వారంతా టార్గెట్‌ కావడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్తి దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తాడని చిదంబరం వివరించారు.

మరిన్ని వార్తలు