త్వరలో బ్యాంకర్లతో భేటీ: చిదంబరం

4 Oct, 2013 05:57 IST|Sakshi
 ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) బ్యాంకుల చీఫ్‌లతో త్వరలో ఆర్థిక మంత్రి పి.చిదంబరం సమావేశం కానున్నారు. ఆటో, వినియోగ వస్తువులుసహా కొన్ని రంగాలకు సంబంధించి వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వివరించనున్నారు.  చిదంబరం గురువారం ఇక్కడ విలేకరులకు ఈ విషయాన్ని తెలిపారు. మందగమనంలో ఉన్న వృద్ధి పునరుత్తేజానికి, డిమాండ్ పెంపొందడానికి కొన్ని రంగాలకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని చిదంబరం భావిస్తున్నారు. కీలక రంగాలకు రుణ సౌలభ్యతను కల్పించడంలో భాగంగా పీఎస్‌యూ బ్యాంకులకు మూలధన పెట్టుబడులను బడ్జెట్‌లో నిర్దేశించుకున్న (రూ.14,000 కోట్లు) మొత్తాలకన్నా పెంచాలని సైతం ప్రభుత్వం నిర్ణయించింది.  ఆర్‌బీఐ గవర్నర్‌తో చర్చలు..: అంతకుముందు చిదంబరం, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్‌ల మధ్య ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే బ్యాంకులకు ప్రభుత్వ పెట్టుబడుల పెంపు ప్రతిపాదనకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
>
మరిన్ని వార్తలు