అఖిలేశ్‌ భవితవ్యం..!?

12 Mar, 2017 02:01 IST|Sakshi
గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పిస్తున్న అఖిలేశ్‌

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ కోలుకుంటుందా? తండ్రిని కాదని అన్ని తానై నడిపించిన అఖిలేశ్‌ పరిస్థితి ఏంటి? మళ్లీ ములాయం పార్టీ పగ్గాలు చేపడతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌తో తాత్కాలిక స్నేహమేగాని ఏనాడూ అధికారం పంచుకోని ములాయం మార్గాన్ని వదిలి అఖిలేశ్‌ సాధించింది శూన్యమే. 1967లో ఎన్నికల బరిలో దిగి.. తొలి ప్రయత్నంలోనే ములాయం విజయం సాధించా రు. సోషలిస్ట్‌ నేత రాంమనోహర్‌ లోహియా, మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ బాటలో పయనించి యూపీలో పెను మార్పులకు పునాదులు వేశారు. మొదటినుంచి బ్రాహ్మణేతర, కాంగ్రెస్‌ వ్యతిరేక రాజకీయాల్ని ములాయం వంటపట్టించుకున్నారు.

అయితే యాదవ పరివారంలో తండ్రి నేతృత్వం లోని వర్గాన్ని పక్కకు నెట్టి నాయకత్వాన్ని అఖిలేశ్‌ కైవసం చేసుకున్నా.. తండ్రి బాటలో మాత్రం పయనించలేదు. 2007లో 97 స్థానాలతో, 2012లో 80 స్థానాలతో బీఎస్పీ ప్రతిపక్ష హోదా సాధించగా.. ఈ సారి ప్రతిపక్ష హోదా పొందిన ఎస్పీ 47 సీట్లకే పరిమితమైంది. అయితే అఖిలేశ్‌ ఎమ్మెల్సీ కావడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కని పరిస్థితి. కాంగ్రెస్‌ను పొత్తుకు ఒప్పించి అఖిలేశ్‌ విజయం సాధించినా... 40 సీట్లకు మించి పోటీచేసే సామర్థ్యం లేని ఆ పార్టీకి 60కిపైగా సీట్లిచ్చి ఆయన పెద్ద తప్పిదం చేశారు.

2019లో బీఎస్పీతో పొత్తు?
1995లో ఎస్పీ–బీఎస్పీ సంకీర్ణ సర్కారు నుంచి బీఎస్పీ వైదొలిగింది. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య వైరం కొనసాగుతోంది. దానికి ముగింపు పలికే అవకాశాన్ని అఖిలేశ్‌ ఉపయోగించుకుంటే లౌకిక, సామాజిక శక్తులు ఏకం కావచ్చు. నరేంద్ర మోదీ దెబ్బతో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు కలిపి విజయం సాధించిన నితీశ్, లాలూను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేయడమే మాయ, అఖిలేశ్‌ల ముందున్న మార్గమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

  శివ్‌పాల్‌ గెలుపు.. అపర్ణ ఓటమి
లక్నోలో బలంగా ఉందనుకున్న ఎస్పీకి రాజధానిలోనూ చుక్కెదురైంది. కంటోన్మెంట్‌ ప్రాంతంలో ములాయం రెండో కోడలు అపర్ణా యాదవ్‌ ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే, సీనియర్‌ పొలిటీషియన్‌ డాక్టర్‌ రీటా బహుగుణ జోషి 33,796 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ అలహాబాద్‌ (పశ్చిమ) స్థానం బరిలో దిగి 25వేల పైచిలుకు ఓట్లతో ఎస్పీ అభ్యర్థి రీచా సింగ్‌పై గెలిచారు.

రాజ్‌నాథ్‌ కుమారుడు పంకజ్‌ సింగ్‌ నోయిడా నుంచి లక్షా నాలుగు వేల ఓట్ల తేడాతో ఎస్పీ అభ్యర్థిని ఓడించారు. అయితే, మాజీ మంత్రి, ఎస్పీ సీనియర్‌ నేత శివ్‌పాల్‌ యాదవ్‌ తన సిట్టింగ్‌ నియోజక వర్గం జస్వంత్‌పూర్‌ నుంచి 52 వేల ఓట్లతో గెలిచారు. ‘‘ఈ ఓటమి ఎస్పీదో, కార్యకర్తలదో కాదు. కేవలం అహంకారం కారణంగానే ఓడిపోయాం’’ అని ఫలితాలు వెల్లడయ్యాక శివ్‌పాల్‌ తెలిపారు.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు