కోతుల బెటాలియన్ను సిద్ధం చేసిన చైనా

8 May, 2014 09:11 IST|Sakshi
కోతుల బెటాలియన్ను సిద్ధం చేసిన చైనా

చైనాలోని ప్రజా విముక్తి సైన్యం (పీఎల్ఏ)కు రోజుకో కొత్త ఆలోచన వస్తున్నట్లుంది. బీజింగ్కు సమీపంలో ఉన్న తమ ఎయిర్ బేస్ను కాపాడుకోడానికి ఒక కోతుల బెటాలియన్ను సిద్ధం చేస్తోంది. భారీ ఎత్తున తమ విమానాలకు ముప్పు కలిగిస్తున్న పక్షుల గుంపును చెదరగొట్టడానికి కోతులకు మించిన ఆయుధాలు వేరే ఏవీ దొరకవని భావించారు. అందుకే వీటికి శిక్షణ ఇచ్చి, పక్షులు వచ్చినప్పుడల్లా వాటిని చెదరగొట్టడం నేర్పించారు. అంతేకాదు, చెట్ల మీద ఉన్న పక్షుల గూళ్లను కూడా ఈ కోతులు నాశనం చేస్తాయి.

యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సమయంలో పక్షులు వాటికి చాలా ముప్పు కలిగిస్తున్నాయని చైనా వైమానిక దళం ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. వాటి బారి నుంచి తప్పించుకోడానికి చాలా ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు. దాంతో వైమానికదళంలో ఓ అధికారికి కోతుల ఆలోచన వచ్చింది. వెంటనే వాటికి శిక్షణ ఇచ్చేవాళ్లను కూడా తీసుకొచ్చి, ఒక్కో కోతి చేత రోజుకు ఆరు చొప్పున పక్షి గూళ్లను ధ్వంసం చేయిస్తున్నారు. ఇలా తమ ఎయిర్బేస్ చుట్టుపక్కల అస్సలు ఒక్క పక్షి అన్నది కూడా ఎగరకుండా చేయాలన్నది వాళ్ల ఆలోచన.
 
సైన్యంలో జంతువులను ఉపయోగించడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకుముందు అమెరికా వాళ్లు మందుపాతరలను గుర్తించేందుకు డాల్ఫిన్ల సాయం తీసుకున్నారు. అలాగే, కుక్కలనైతే ఎప్పటినుంచో అన్ని దేశాల పోలీసులు, సైన్యం ఉపయోగించుకుంటున్నాయి. అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ను హతమార్చిన ఆపరేషన్లో కూడా కైరో అనే బెల్జియన్ షెపర్డ్ రకం శునకం సేవలను అమెరికా ఉపయోగించుకుంది.

మరిన్ని వార్తలు