ప్రపంచంలో అతిపెద్ద సీప్లేన్ ఇదేనట!

25 Jul, 2016 20:22 IST|Sakshi
ప్రపంచంలో అతిపెద్ద సీప్లేన్ ఇదేనట!

షాంఘై : ఏడేళ్ల అలుపులేని కృషితో, చైనా తన భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో మరో కలికితురాయిని చేర్చుకుంది. త్రివిధ దళాలకు ఉపయోగపడే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సీప్లేన్ను తయారుచేసింది. సముద్ర రెస్క్యూ బృందాలకు... అడవిలో అంటుకున్న మంటలను ఆర్పడంలోనూ ఈ ఎయిర్ క్రాప్ట్ త్రివిధ దళాలకు కీలకంగా ఉపయోగపడనుందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. బోయింగ్ 737 పరిమాణంలో ఉండే ఈ సీప్లేన్ ఏజీ600ను ఆ దేశ ఎయిర్క్రాప్ట్ తయారీదారి ఏవియేషన్ ఇండస్ట్రి కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఏవీఐసీ) రూపొందించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద సీప్లేన్ను చైనా తయారుచేయడం ఏవియేషన్ రంగంలో ఒక మైలురాయి అని ఏవీఐసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గెంగ్ రుగాంగ్ తెలిపారు. 53.5 టన్నుల సామర్థ్యాన్ని ఇది టేక్-ఆఫ్ చేయగలదని, 12 టన్నుల నీళ్లను 20 సెకండ్లలో సేకరించగలదని వెల్లడించారు. అడ్వాన్స్డ్ మిలటరీ ఈక్విప్మెంట్ల(జలాంతర్గాములు, విమాన వాహక, యాంటీ శాటిలైట్ క్షిపణుల)పై దృష్టిసారించిన చైనా, ఈ సీప్లేన్ను రూపొందించింది. 2009లో ఈ ప్లేన్ తయారీకి ఏవీఐసీ, ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. అనంతరం ఏడేళ్లపాటు నిరంతర కృషితో దీన్ని అభివృద్ధి చేసి తయారుచేశారు. తన మొదటి అతిపెద్ద మిలటీర ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాప్ట్ ను గత జూన్లోనే మిలటరీ సర్వీసులోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు