చైనా రాకెట్ ప్రయోగం విఫలం

8 Sep, 2016 20:30 IST|Sakshi
చైనా రాకెట్ ప్రయోగం విఫలం

బీజింగ్: అత్యంత అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో సిద్ధం చేసిన ఓ శాటిలైట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టడంలో చైనా విఫలం చెందింది. షాంగ్సీలోని తయ్యువాన్ ఉపగ్రహ ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ గాలిలోనే పేలిపోయింది. అయితే దీనిపై చైనా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. చైనా వ్యోమగాములు నడిపై ఓ వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన ఈ వివరాలను ఉంచారు. చైనా చేసే రాకెట్ ప్రయోగాలు విఫలం చెందడం చాలా అరుదు. 2013లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కూడా ఇలానే కక్ష్యలోకి వెళ్లకముందే పేలిపోయింది.

లాంగ్ మార్చ్4సీ రాకెట్ ద్వారా గావోఫెన్-10 ఉపగ్రహాన్ని గురువారం చైనా ప్రయోగించింది. నింగిలోకి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక లోపంతో రాకెట్ పేలిపోయింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను షాంగ్సీకు చెందిన వారు సోషల్ మీడియాలో ఉంచారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన లాంచింగ్ వెహికల్ గా లాంగ్ మార్చ్ ను చైనా పేర్కొన్న విషయం తెలిసిందే. లాంగ్ మార్చ్ వెహికల్ ద్వారా చైనా సంవత్సరానికి 20కి పైగా ప్రయోగాలు నిర్వహిస్తోంది.

ఎర్త్ అబ్జర్వేషన్ కోసం తయారు చేసిన ఈ అత్యాధునిక శాటిలైట్ లను మిలటరీ, పౌర అవసరాలకు చైనా ప్రయోగిస్తోంది. 2020లోగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు చైనా కృషి చేస్తుండగా తాజా ప్రయోగ విఫలం దాన్ని మరికొంచెం ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఈ ఉపగ్రహ ప్రయోగాలు విజయవంతమైతే భూమి మీద ఉన్న ఏ ప్రాంతాన్నైనా హై డెఫినీషన్ క్వాలిటీతో వీక్షించేందుకు అవకాశం కలుగుతుంది. హ్యాక్ ప్రూఫ్ కమ్యూనికేషన్ కోసం చైనా క్వాంటమ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు