పక్షుల కోసం ప్రత్యేకంగా ఎయిర్‌పోర్ట్‌

21 Feb, 2017 03:01 IST|Sakshi



న దేశం నుంచి అమెరికా వెళ్లే ప్రయాణికుల్లో చాలామంది ఫ్రాంక్‌ఫర్ట్‌లోనూ, దుబాయ్, లండన్‌లోనో ఆగి వెళుతూంటారు. అలాగే తూర్పు దేశాలకు వెళ్లేవారి కోసం సింగపూర్‌ ఒక హబ్‌గా పని చేస్తుంది. మనుషుల కోసం ఇలాంటి విమానాశ్రయ హబ్స్‌ ఉన్నాయని మనకు తెలుసుగానీ త్వరలోనే పక్షుల కోసమూ ఇలాంటిది ఒకటి నిర్మాణమవుతోందని తెలిస్తే ఔరా అనుకోక మానం. నిజం. అచ్చంగా పక్షుల కోసమే చైనాలో ఓ విమానాశ్రయం సిద్ధమవుతోంది. ఇక్కడ బోయింగ్‌ విమానాలు ల్యాండ్‌ కావు. తమ రెక్కలే ఇంజిన్లుగా వేల మైళ్లు ప్రయాణించే వలస పక్షులకు తాత్కాలిక విశ్రాంతి గృహంగా మాత్రమే ఇది పని చేస్తుంది. అంటే ఇది  బర్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ అన్నమాట. అర్థం కావడం లేదా? కొంచెం వివరంగా తెలుసుకుందాం.

ప్రపంచం నలుమూలలలోని పక్షులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళుతూంటాయని మనకు తెలుసు.  అలా వలసవెళ్లే పక్షులు దారి మధ్యలో ఆగి సేద తీరడానికీ లేదా ప్రతి సంవత్సరం వలస రావడానికి వీలుగా శాశ్వత వలస కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికీ తక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయి.  దీనిని గమనించిన చైనాలోని టియాన్‌జిన్‌  పోర్ట్‌ ట్రస్ట్‌ ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. లిన్‌గాంగ్‌ ప్రాంతంలో ఉన్న ఓ డంపింగ్‌ యార్డ్‌ను పక్షుల ఆవాస కేంద్రంగా మార్చాలని సంకల్పించింది. ఇందుకు తగిన డిజైన్లు రూపొందించాల్సిందిగా అంతర్జాతీయ డిజైనర్లను కోరగా మక్‌గ్రెగర్‌ కాక్స్‌ ఆల్‌ అనే సంస్థ  పక్క ఫొటోల్లో కనిపిస్తున్న డిజైన్లను సిద్ధం చేసింది.


ఈ బర్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ తయారీకి దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో చిత్తడి నేలలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం శుద్ధి చేసిన మురుగునీరు... వాన నీటిని మాత్రమే వాడతారు. అంటార్కిటికా నుంచి ఆస్ట్రేలియా మీదుగా వలస వచ్చే దాదాపు 5 కోట్ల పక్షులు ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఇది తయారవుతుంది.  అంతరించిపోతున్న అరుదైన పక్షి జాతులను సంరక్షించుకునేందుకు బర్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఉపయోగపడుతుందని అంచనా. ఈ ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లోనే దాదాపు 7 కిలోమీటర్ల పొడవైన సైక్లింగ్‌ ట్రాక్, పచ్చటి పార్కు కూడా ఏర్పాటు చేసి పక్కనే ఉన్న టియాన్‌జిన్‌ నగర ప్రజలకు ఓ టూరిస్ట్‌ ఎట్రాక్షన్‌గానూ దీన్ని అభివృద్ధి చేయనున్నారు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఏడాదిలోపు ఈ వినూత్నమైన బర్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ పక్షుల రాకకు సిద్ధమవుతుంది!
  – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

 

మరిన్ని వార్తలు