ఒకడు రేప్ చేస్తే.. మరొకరికి ఉరిశిక్ష

18 Oct, 2016 16:41 IST|Sakshi
ఒకడు రేప్ చేస్తే.. మరొకరికి ఉరిశిక్ష

నేరం చేయని వ్యక్తికి ఉరిశిక్ష పడేలా చేయడంతో పాటు అక్రమ సంపాదన, అక్రమంగా ఆయుధాలను అమ్మిన కేసులో చైనాలో ఓ సీనియర్ పోలీస్ అధికారికి 18 ఏళ్ల జైలు శిక్ష పడింది. హోహాట్ పోలీస్ మాజీ డిప్యూటీ హెడ్ ఫెంగ్ ఝిమింగ్ దాదాపు 38 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నాడని, అక్రమంగా నాలుగు తుపాకులను అమ్మారని కోర్టులో రుజువైంది. ఓ హత్య కేసులో విచారణాధికారిగా వ్యవహరించిన ఫెంగ్.. నిర్దోషిని ఇరికించి ఉరిశిక్షపడేలా చేసినట్టు తేలింది. దీంతో మంగళవారం కోర్టు అతనికి కఠిన కారాగార శిక్ష విధించింది.

ఓ పబ్లిక్ రెస్ట్రూమ్లో ఓ యువతిని అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో హూజ్జిత్ అనే యువకుడిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు నేతృత్వం వహించిన ఫెంగ్.. హూజ్జిత్ నేరం చేసినట్టు తేల్చడంతో అతనికి ఉరిశిక్ష విధించారు. కాగా హూజ్జిత్ నేరం చేయలేదని, పొరపాటున అతనికి శిక్ష వేశారని తర్వాత తేలింది. 2014లో షూజ్జిత్ను నిర్ధోషిగా ప్రకటించిన కోర్టు.. అసలైన నేరస్తుడికి ఉరిశిక్ష విధించింది. అయితే అంతకుముందే హూజ్జిత్ను ఉరితీయడంతో చైనాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించగా, ఫెంగ్ అక్రమాలు వెలుగుచూశాయి.
 

మరిన్ని వార్తలు