చైనీయుల కోసం పాక్‌ బలగాల మోహరింపు!

12 Sep, 2016 09:40 IST|Sakshi
చైనీయుల కోసం పాక్‌ బలగాల మోహరింపు!

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడర్‌ (సీపీఈసీ)కు దాయాది దేశంలో పెద్ద ముప్పే ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. అన్ని కాలాల్లోనూ పాక్‌ తమకు మిత్రదేశమేనని చైనా గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆ దేశంలో మాత్రం సీపీఈసీ లక్ష్యంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క చైనా కార్మికుడి కోసం ఇద్దరు  సైనికులను పహారా పెట్టిమరీ రక్షణ కల్పిస్తోంది పాకిస్థాన్‌.

ప్రస్తుతం పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు కోసం 7,036 మంది చైనా కార్మికులు పనిచేస్తుండగా.. వారికి ఏకంగా 14,503మంది పాక్‌ సైనికులు భద్రత కల్పిస్తుండటం విశేషం. పంజాబ్‌లో జిహాదీ ఉగ్రవాదుల ముప్పు అధికంగా ఉండటంతో ఇక్కడ చైనా కార్మికులకు భారీ భద్రత కల్పిస్తున్నారు. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీకి తాజాగా సమర్పించిన లెక్కల ప్రకారం చైనీయులకు పంజాబ్‌లో  6,364 మంది, బలూచిస్థాన్‌లో 3134 మంది, సింధ్‌లో 2654 మంది, ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వాలో 1912 మంది, ఇస్లామాబాద్‌లో 439 మంది సైనికులు భద్రత కల్పిస్తున్నారు. పాకిస్థాన్‌ పీపుల్‌ పార్టీ సభ్యుడు షాహిదా రెహ్మాన్‌ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది.

చైనాలోని కాష్గర్‌ నుంచి బలూచిస్థాన్‌లోని గ్వాదర్‌ ఓడరేవు వరకు రెండువేల కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న సీపీఈసీతో పాకిస్థాన్‌ రూపురేఖలు మారిపోతాయని ఆ దేశ ప్రభుత్వం భావిస్తున్నది. అయితే, బలూచిస్థాన్‌ జాతీయవాదులు, తాలిబన్‌ ఫ్యాక్షన్‌ గ్రూపులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తుండటం పాక్‌ను ఆందోళనకు గురిచేస్తున్నది.
 

>
మరిన్ని వార్తలు