ఆ విమాన ఆచూకీ కోసం గాలింపు చేపట్టండి ... ప్లీజ్

30 Jan, 2015 10:36 IST|Sakshi
ఆ విమాన ఆచూకీ కోసం గాలింపు చేపట్టండి ... ప్లీజ్

బీజింగ్: గతేడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం ప్రమాదానికి గురైందని ... ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 239 మంది ప్రయాణికులు మరణించారని మలేసియా ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాద ఘటనపై చైనా ప్రభుత్వం శుక్రవారం స్పందించింది. విమాన ఆచూకీ కనుగొనేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని మలేసియా ప్రభుత్వానికి చైనా ప్రధాని లీ కెకియాంగ్ విజ్ఞప్తి చేశారు. విమాన ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బంగాళాఖాతంలో దాదాపు 60 వేల చదరపు కిలోమీటర్లు మేర ప్రపంచ దేశాల సహాయంతో విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయిందని లీ కెకియాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. చైనా ప్రభుత్వం ఇంకా గాలింపు చర్యలు జరుపుతూనే ఉందని గుర్తు చేశారు. మలేసియా కూడా గాలింపు చర్యల చేపడితే విమాన జాడ కనుక్కోవచ్చని చైనా ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో ఫ్రెంచ్ ప్రధాని ఎం వాల్స్ కూడా పాల్గొన్నారు.

239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం ఈ ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది.  బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. విమానం ఎమైంది... తమ బంధువులు బతికే ఉన్నారా లేక మరణించారా అనే విషయం తెలియక సదరు ప్రయాణీలకు బంధువులు తీవ్ర వేదన చెందుతున్నారు.

విమాన ఆచూకీ కనుగోనడంలో విఫలమైందంటూ వారు మలేసియా ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే ఎమ్హెచ్ 370 ప్రమాదానికి గురైందని మలేసియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో మృతుల కుటుంబసభ్యులు, బంధువులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఈ విమానంలో 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు