ఉగ్రవాదంపై పోరుకు చైనా కఠిన చట్టం

28 Dec, 2015 02:49 IST|Sakshi

బీజింగ్: ఉగ్రవాదంపై చైనా ఉక్కు పాదం మోపేందుకు సిద్ధమైంది. దీన్ని అరికట్టేందుకు తొలిసారిగా కఠిన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భావ, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని అమెరికా గగ్గోలు పెట్టినా ఖాతరు చేయకుండా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్‌పీసీ-పార్లమెంట్) స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానంతో రూపొందించిన ఈ చట్టానికి అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ఆదివారం ఆమోదముద్ర వేసింది. జాతీయ భద్రతా సంస్థలకు తాజా చట్టం విస్తృతమైన అధికారాలు కట్టబెట్టింది. టిబెట్ వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ చట్టాన్ని అమలు చేయనున్నారు. అయితే ఈ చట్టం వల్ల ఇబ్బందులు కలుగుతాయని అమెరికా పేర్కొనగా.. తమ వ్యవహారాల్లో  జోక్యం తగదంటూ చైనా తిప్పికొట్టింది.

 చైనాలో తొలి గృహహింస నిరోధక చట్టం
 చైనా పార్లమెంటు ఆదివారం దేశంలో తొలి గృహహింస చట్టాన్ని ఆమోదించింది. బాధితులకు, సహజీవనం చేసేవారికి దీనికింద న్యాయరక్షణ లభిస్తుంది. మానసిక వేధింపులతోపాటు అన్నిరకాల గృహహింసలను  నిషేధించారు. వారం పాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఎన్‌పీసీ స్థాయూ సంఘం దీనికి ఆమోదం తెలిపింది. ప్రజలు రెండో బిడ్డను కనేందుకు ఉద్దేశించిన చట్టాన్ని కూడా పార్లమెంట్ ఆమోదించింది.

మరిన్ని వార్తలు