బ్రేకింగ్‌: దూసుకొచ్చిన చైనా యుద్ధనౌకలు

4 Jul, 2017 12:12 IST|Sakshi
దూసుకొచ్చిన చైనా యుద్ధనౌకలు
  • హిందూ మహా సముద్రంలో చక్కర్లు

  • న్యూఢిల్లీ: ఒకవైపు సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం.. మరోవైపు భారత్‌-చైనా మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న  నేపథ్యంలో చైనా యుద్ధనౌకలు హిందూ మహాసముద్రంలో చక్కర్లు కొడుతుండటం కలకలం రేపుతోంది. చైనీస్‌ యుద్ధనౌకలు అనూహ్యరీతిలో భారత్‌కు ఆనుకొని ఉన్న హిందూమహాసముద్రంలో సంచరిస్తుండటం గమనార్హం.

    సిక్కిం సరిహద్దుల్లో నెలరోజులుగా ఇరుదేశాల ఆర్మీ మధ్య ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలతో ఇప్పుడున్న భారత్‌ 1962నాటి భారత్‌ కాదంటూ రక్షణమంత్రి జైట్లీ వ్యాఖ్యానించగా.. ఆయన ప్రకటనపై చైనా స్పందించింది. ‘జైట్లీ సరిగ్గానే చెప్పారు. 1962 కన్నా 2017నాటి భారతం భిన్నంగా ఉంది. ప్రస్తుత చైనా కూడా అప్పటి చైనా కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ సోమవారం హెచ్చరించారు.

    1890 నాటి చైనా బ్రిటిష్‌ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత ఆర్మీ మోసం చేస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా తమ భూభాగంలోకి సైన్యం చొచ్చుకొచ్చిందని ఆయన ఆరోపించారు. వెంటనే భారత బలగాలను వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంలో భౌగోళిక సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చైనా అన్ని అత్యవసర చర్యలు చేపడుతుందని పరోక్షంగా యుద్ధానికైనా సిద్ధమనే సంకేతాలిచ్చారు. సిక్కిం ప్రాంతంలో భారత్‌-చైనా దేశాల మధ్య సరిహద్దులు ముందుగా నిర్ణయించినట్లుగానే ఉన్నాయన్నారు. ‘మా భూభాగంలోకి ప్రవేశించటం, మా సైనికుల కార్యక్రమాలకు అడ్డుతగలటం ద్వారా అంతర్జాతీయ సరిహద్దు నిబంధనలను భారత్‌ ఉల్లంఘిస్తోంది. సరిహద్దుల్లో శాంతికి ఆటంకం కలిగిస్తోంది. వెంటనే భారత ఆర్మీ వెనక్కు వెళ్లిపోవాలి’ అని గెంగ్‌ అన్నారు.


    ‘సిక్కింపై 1890 నాటి చైనా–బ్రిటిష్‌ ఒప్పందాన్ని తొలి భారత ప్రధాని నెహ్రూ 1959లో నాటి చైనా ప్రధాని చౌ ఎన్‌లైకి రాసిన లేఖలో ఆమోదించారు. తర్వాతి భారత ప్రధానులందరూ దీన్ని గౌరవిస్తూనే వచ్చారు. కానీ ఈ మధ్య సిక్కిం సరిహద్దుల్లో భారత్‌ తీసుకున్న చర్య మోసపూరితం. డోకా  లా చైనాకు సంబంధించిన ప్రాంతం. అందుకే భారత్‌ వెనక్కు వెళ్లిపోవాలి’ అని గెంగ్‌ హెచ్చరిక స్వరంతో తెలిపారు. అయితే దౌత్యపరంగా ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. భూటాన్‌ను భారత్‌ రక్షణ కవచంలా వినియోగించుకుంటోందని గెంగ్‌ ఆరోపించారు. అవసరమైతే భూటాన్‌ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల (భారత్‌) జోక్యం లేకుండా ఉండేందుకు తాము పూర్తిగా సహకరిస్తామని గెంగ్‌ తెలిపారు. చైనాతో ఎటువంటి దౌత్యపరమైన సంబంధాల్లేని భూటాన్‌కు మిలటరీ పరంగా, దౌత్యపరంగా భారత్‌ రక్షణ పూర్తి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ టిబెట్‌ ప్రాంతమైన చుంబీ లోయపై ఆధిపత్యం ప్రదర్శించటం ద్వారా భారత–భూటాన్‌ సరిహద్దుల్లో జరిగే కార్యకలాపాలపై దృష్టిపెట్టాలని చైనా ప్రయత్నిస్తోందని రక్షణరంగ నిపుణులు భావిస్తున్నారు.  


    నెలాఖర్లో బీజింగ్‌కు దోవల్‌
    భారత్‌–చైనా సరిహద్దు చర్చల ప్రత్యేక ప్రతినిధి అయిన జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ జూలై 26న బ్రిక్స్‌ దేశాల ఎన్‌ఎస్‌ఏల సమావేశానికి హాజరుకానున్నారు. ఆ సమయంలోనే చైనా ఎన్‌ఎస్‌ఏ యాంగ్‌ జీచీతో సిక్కింపై చర్చించే అవకాశం ఉంది. చైనా సరిహద్దుల్లో ఉన్న సిక్కిం 1976లో భారత్‌లో అంతర్భాగమైంది. 1898లో చైనాతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం సిక్కిం సరిహద్దులను నిర్ణయించారు. సిక్కింలో చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత్‌ అడ్డుకోవటం.. మోదీ అమెరికా పర్యటనలో ట్రంప్‌ను ఆకట్టుకునేందుకేనని చైనా మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.
     

మరిన్ని వార్తలు