సద్దాం హుస్సేన్‌పై సంచలన విషయాలు!

17 Dec, 2016 15:35 IST|Sakshi
ఇరాక్‌ను సద్దాంకే వదిలేయాల్సింది

ఆయన వల్లే ఇరాక్‌ ఐక్యత సాధ్యపడింది
సీఐఏ అధికారి తాజా పుస్తకంలో సంచలన విషయాలు



2003లో ఇరాక్‌పై అమెరికా దండెత్తి ఉండాల్సింది కాదని ప్రస్తుత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు తీరిగ్గా విచారిస్తున్నారు. ఇరాక్‌లో అమెరికా చేసిన యుద్ధం, ఆ తర్వాత నెలకొన్న గందరగోళ పరిస్థితులే మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి కారణం. ఇది జాతుల సంఘర్షణకు దారితీసి ఇరాక్‌, సిరియాలను వెంటాడుతున్నదనే భావనతోనే అక్కడి విషయాల్లో తదుపరి జోక్యానికి ఒబామా సర్కారు నిరాకరించింది.

ఈ నేపథ్యంలో ఇరాక్‌ పాలకుడు సద్దాం హుస్సేన్‌ను విచారించిన అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ మాజీ అధికారి జాన్‌ నిక్సన్ ఈ నెలలో తీసుకొస్తున్న పుస్తకం ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధం వల్ల పదవీభ్రష్టుడైన సద్దాం హుస్సేన్‌ 2013 డిసెంబర్‌లో సంకీర్ణ సేనలకు చిక్కారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన సంవాదం, విచారణ విషయాలను తాజా పుస్తకంలో నిక్సన్‌ వివరించారు. ఇరాక్‌ను ఆక్రమించడం అప్పటి వాషింగ్టన్‌ నియోకన్జర్వేటివ్‌లు అనుకున్నంత సులభం కాదని సద్దాం అప్పుడే హెచ్చరించారని ఆయన తన పుస్తకంలో తెలిపారు. ఈ పుస్తకంలోని పలు వివరాలను టైమ్‌ మ్యాగజీన్‌ వెల్లడించింది.

'సద్దాంను నేను విచారించినప్పుడు.. 'మీరు విఫలం కాబోతున్నారు. ఇరాక్‌ను పాలించడం అంత సులభం కాదని మీరు తెలుసుకుంటారు' అని ఆయన అన్నారు. ఎందుకు అలా అనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? అని నేను అడుగగా.. 'మీరు ఇరాక్‌లో ఎందుకు విఫలమవుతారంటే.. మీకు స్థానిక భాష, చరిత్ర తెలియదు. మీరు అరబ్‌ మనోగతాన్ని అర్థం చేసుకోలేరు' అని సద్దాం అన్నారు' అని నిక్సన్‌ వివరించారు.


నిజానికి సద్దం చెప్పింది నిజమేనని, బహుళ జాతుల సమ్మేళనమైన ఇరాక్‌ మనుగడకు, సున్నీ ఉగ్రవాదం, షియాల ఆధిపత్యముండే బద్ధవిరోధి ఇరాన్‌ను ఎదుర్కోవడానికి ఆయనలాంటి నిరంకుశ శక్తిమంతుడు అవసరమని ఇప్పుడు అనిపిస్తోందని నిక్సన్‌ అభిప్రాయపడ్డారు.

'సద్దాం నాయకత్వ శైలి, క్రూరత్వం అతని పాలనలోని లోపాలుగా చెప్పవచ్చు. కానీ తన పరిపాలన పునాధికి ఎలాంటి ముప్పు వాటిల్లినా సద్దాం చాలా నిరంకుశంగా వ్యవహరించాడు. ప్రజాఉద్యమంతో, ప్రజాఅసంతృప్తితో తన ప్రభుత్వం కూలిపోతుందన్న భయమేలేని స్థితిలో ఆయన ప్రభుత్వాన్ని నడిపాడు' అని నిక్సన్‌ పేర్కొన్నాడు. సద్దాం హయాంలో క్రూరమైన ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ విజయం సాధించే ప్రసక్తే లేదని, ప్రస్తుత షియా ప్రభుత్వ బలహీనత వల్లే ఇస్లామిక్‌ స్టేట్‌ ఇంత స్థాయికి రాగిలిందని అభిప్రాయపడ్డారు.

సద్దాంలో ఎన్ని ప్రతికూలతలు ఉన్నా.. తాను ఉన్నంతకాలం ఇరాక్‌ను ఒక దేశంగా ఐక్యంగా కొనసాగించినందుకు ఆయనపై తనకు అపారమైన గౌరవం కలిగిందని నిక్సన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ విషయంలో ఎంత వాదన జరిగినా.. చివరకు తాను పేర్కొన్న విషయాన్ని అంగీకరించక తప్పదని, నిజానికి ఇరాక్‌ను నడిపించే బాధ్యతను సద్దాంకు వదిలేసి ఉంటే బాగుండేదని నిక్సన్‌ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు