అడ్రస్‌ల కోసం అగచాట్లు

14 Aug, 2015 02:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ గన్‌మెన్, డ్రైవర్లకు జారీ చేసిన నోటీసులు పట్టుకుని సీఐడీ, విశాఖపట్నం పెందుర్తి పోలీసులు చక్కర్లు కొడుతున్నారు. వీటిని అందించాల్సిన వ్యక్తుల ఆచూకీ గురువారం రాత్రి లభించకపోవడంతో చిరునామాల కోసం వెతుకులాట కొనసాగిస్తున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు తనయుడు లోకేష్ డ్రైవర్ కొండల్‌రెడ్డికి తెలంగాణ ఏసీబీ నుంచి నోటీసు జారీ అయ్యింది. దీంతో ఏపీ సీఐడీ అధికారులు కేటీఆర్ గన్‌మెన్, డ్రైవర్లు జానకిరామ్, సత్యనారాయణలకు బుధవారం నోటీసులు సిద్ధం చేశారు.

మరోపక్క పెందుర్తి పోలీసులు 2013లో నమోదైన కేసుకు సంబంధించి కేటీఆర్ డ్రైవర్, అనుచరుడిగా అనుమానిస్తున్న మధుసూదన్‌రెడ్డి, సతీష్‌రెడ్డిలకు నోటీసులు తీసుకుని బుధవారమే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ బృందాలు నోటీసులు అందించాల్సిన వ్యక్తుల్ని వెతుక్కుంటూ బుధవారం రాత్రి తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం, కేటీఆర్ నివాసం, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కార్యాలయాలకు వెళ్లాయి. నోటీసులు అందించాల్సిన వారి ఆచూకీ అక్కడ లభించకపోవడంతో గురువారం ఉదయం ఆ బృందాలు కరీంనగర్ వెళ్లాయి.

జానకిరామ్, సత్యనారాయణలు వాస్తవానికి కరీంనగర్ జిల్లా పోలీసు ఆధీనంలోని జిల్లా ఆర్డ్మ్ రిజర్వ్ (డీఏఆర్) విభాగానికి చెందిన ఏఆర్ కానిస్టేబుళ్లు. కేటీఆర్ మంత్రి అయిన తరవాత డిప్యుటేషన్‌పై ఐఎస్‌డబ్ల్యూలో రిపోర్ట్ చేసి కేటీఆర్ వద్ద విధులు కొనసాగిస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి సైతం కరీంనగర్ డీఏఆర్‌లోనే పని చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడకు వెళ్లిన సీఐడీ, పెందుర్తి పోలీసులు.. వారి కోసం ఆరా తీసినా ఫలితం లభించలేదు. దీంతో గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుని తదుపరి ప్రయత్నాలు ప్రారంభించాయి.

మరిన్ని వార్తలు