సినిమా టికెట్ల ధరల పెంపునకు బ్రేక్‌

1 Jul, 2017 02:29 IST|Sakshi
సినిమా టికెట్ల ధరల పెంపునకు బ్రేక్‌

- జీవోను తాత్కాలికంగా నిలిపేసిన ప్రభుత్వం
హోం శాఖ ఆగమాగపు జీవోపై అనుమానాలు
తనను తప్పుదోవ పట్టించారని సీఎస్‌ అసంతృప్తి
సీఎం వద్దకు వివాదం.. జీవో ఆపేయాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: సినిమా టికెట్ల ధరల పెంపు ఉత్తర్వులను ప్రభుత్వం తాత్కాలి కంగా నిలిపేసింది. ఈ మేరకు హోం శాఖ జారీ చేసిన జీవోను అభయెన్స్‌లో పెట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ పరిణామాల తర్వాత విచారించి నిర్ణయం తీసుకుందామని అధికారులకు సీఎం సూచించినట్లు తెలిసింది. సీఎం ఆదేశాల మేరకు జీవోను వెంటనే నిలిపేయాలని హోం శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ ఆదేశించారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను భారీగా పెంచుతూ ఈనెల 23న హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీ థియేటర్లలో గరిష్టంగా రూ.70 ఉన్న ధరను రూ.120కి పెంచగా.. పెరిగిన ధరలను థియేటర్లు ఇప్పటికే అమల్లోకి తెచ్చాయి.

అయితే సామాన్య ప్రేక్షకులపై భారం పడుతుందని సినీ పరిశ్రమతో పాటు అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమైంది. ఈలోగా పెంపుపై తెరవెనుక నాటకీయ పరిణామాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ సిఫార్సుల మేరకు ధరలను పెంచినట్లు జీవోలో హోం శాఖ ప్రస్తావించింది. కానీ.. తనకు తెలియకుండానే, తనను తప్పుదోవ పట్టించి జీవో జారీ చేశారంటూ.. 2 రోజుల కిందట హోం శాఖ అధికారులపై సీఎస్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
 
వెబ్‌సైట్‌ నుంచి జీవో తొలగింపు
టికెట్‌ ధరలను నిర్ణయించేందుకు హోం శాఖ ముఖ్య కార్యదర్శుల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ ఏడాది మార్చి 30లోగా మార్గదర్శకాలు రూపొందించాలని గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రేక్షకుల ప్రయోజనాలు, ఎగ్జిబిటర్లు, పంపిణీ దారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ధరలు నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ధరల పెంపునకు కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే ధరలు ఎంత మేర పెంచుతున్నారనే వివరాలను హోం శాఖ ప్రస్తావించకుండా నోట్‌ ఫైల్‌ను సీఎస్‌కు పంపించి.. హడావుడిగా జీవో జారీ చేసినట్లు తెలిసింది. దీంతో తనను తప్పుదోవ పట్టించా రంటూ సంబంధిత శాఖ అధికారులను సీఎస్‌ వివరణ కోరినట్లు సమాచారం. మరోవైపు ఈ విషయాన్ని సీఎంకు నివేదించి ఫైలును పంపారు. వరుసగా జరుగుతున్న నాటకీయ పరిణామాలతో శుక్రవారం ఉదయాన్నే ఇంటర్నల్‌ వెబ్‌సైట్‌ నుంచి జీవోను హోం శాఖ తొలగించింది. 

 

 

మరిన్ని వార్తలు