నిరాశపర్చిన సిప్లా...కొత్త సీఈవోగా ఉమాంగ్ వోరా

12 Aug, 2016 18:13 IST|Sakshi
నిరాశపర్చిన సిప్లా...కొత్త సీఈవోగా ఉమాంగ్ వోరా

న్యూఢిల్లీ: వరుసగా ఫార్మా దిగ్గజాలు శుక్రవారం  ఫలితాలను నమోదు చేశాయి.  ఒకవైపు సన్ ఫార్మా మెరుగైన  ఫలితాలను నమోదు చేయగా,  మరో ఫార్మా జెయింట్  సిప్లా  ఊహించిన దానికంటే తక్కువ  త్రైమాసిక లాభాన్ని నమోదుచేసింది.   ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1)లో దేశీ అయిదవ అతి పెద్ద ఫార్మా దిగ్గజం సిప్లా లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది.   రూ.376 కోట్లుగా ఉండనుందని  ఎనలిస్టులు అంచనా  వేయగా....కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన  ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్ లో నికర లాభం 44 శాతం క్షీణించి , రూ. 365 (54.59 మిలియన్  డాలర్లు) కోట్లకు పరిమితమైంది.  గత ఏడాది ఇది రూ. 649కోట్లుగా నమోదైంది.   మొత్తం ఆదాయం కూడా 6 శాతం తగ్గి రూ. 3594 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా)లో 42 శాతం కోత పడటంతో రూ. 611 కోట్లకు దిగింది. ఇబిటా మార్జిన్లు కూడా 27.5 శాతం నుంచి 17 శాతానికి బలహీనపడ్డాయి. అయితే పన్ను వ్యయాలు రూ. 242 కోట్ల నుంచి రూ. 71 కోట్లకు తగ్గాయి. ఇక ఇతర ఆదాయం రూ. 25 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలియజేసింది. ఎండీ, గ్లోబల్‌ సీఈవో సుభాను సక్సేనా పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ పేర్కొంది.  సక్సేనా స్థానంలో కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఉమాంగ్  వోరా  సంస్థ  కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించినట్టు   తెలిపింది.  ఈ నియామకం  సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని  పేర్కంది.  కాగా, ట్రేడింగ్‌ ముగిసేసరికి సిప్లా షేరు బీఎస్‌ఈలో 1.3 శాతం నష్టంతో రూ. 517 వద్ద నిలిచింది.
 

మరిన్ని వార్తలు