ఫీజు కట్టలేదని.. పిల్లాడిని కొట్టి చంపేశారు!

29 Aug, 2016 08:03 IST|Sakshi
ఫీజు కట్టలేదని.. పిల్లాడిని కొట్టి చంపేశారు!

తల్లిదండ్రులు సకాలంలో ఫీజు చెల్లించలేకపోయారనే కారణంతో ఆరో తరగతి చదువుతున్న ఓ పిల్లాడిని స్కూలు అధికారులు దారుణంగా కొట్టి చంపేశారు. ఈ దారుణం మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో జరిగింది. సురేష్ తొంగ్‌బ్రమ్ అనే విద్యార్థిని కొట్టినందుకు స్కూలు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థిది అసహజ మరణం అని తేలితే వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. తమది పేద రైతు కుటుంబం కావడంతో ఇంఫాల్ సమీపంలోని లాంగోల్‌లో గల రెసిడెన్షియల్ కిడ్స్ కేర్ స్కూలు ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లించలేకపోయానని సురేష్ తండ్రి బీరా తొంగ్‌బ్రమ్ చప్పారు. తమ అబ్బాయి రెండేళ్ల క్రితం ఆ స్కూల్లో చేరాడన్నారు. ఫీజులు చెల్లించాలి లేదా పిల్లాడిని తీసుకెళ్లిపోవాలని వాళ్లు చెప్పారని, దాంతో ఏమీ చేయలేక తాను పిల్లాడిని తీసుకెళ్లిపోదామని స్కూలుకు వెళ్తే.. ఫీజులు చెల్లించనిదే తీసుకెళ్లడానికి వీల్లేదన్నారని ఆయన తెలిపారు.

శుక్రవారం రాత్రి స్కూలు వాళ్లు తన కొడుకును ఇంటికి తీసుకొచ్చారని, అతడి శరీరం అంతా వాతలు తేలి ఉన్నాయని.. ఏంటని అడిగితే క్రమశిక్షణ తప్పడం వల్ల శిక్షించినట్లు చెప్పారని అన్నారు. అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోతూ ఈనెల 31 లోగా మొత్తం ఫీజు చెల్లించాలని తనకు చెప్పారన్నారు. ఇంటికి రాగానే కుప్పకూలిపోయిన సురేష్.. ఆ మర్నాడే మరణించాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే.. తనకు న్యాయం జరిగేవరకు కొడుకు శవాన్ని తాను తీసుకెళ్లేది లేదని బీరా తొంగ్‌బ్రొమ్ చెప్పారు. స్కూలు వాళ్లు ఇష్టం వచ్చినట్లు కొట్టడం వల్లే సురేష్ చనిపోయాడని ఆయన అంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్కూలు వర్గాలు ఏమీ స్పందించలేదు.

మరిన్ని వార్తలు