నాలుగో తరగతి పిల్లలకు ఇదా చెప్పేది!

10 Feb, 2017 10:08 IST|Sakshi
నాలుగో తరగతి పిల్లలకు ఇదా చెప్పేది!
పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఎంత బాధ్యతగా ఉండాలో, ఆ పాఠ్య పుస్తకాలు రాసేవాళ్లు మరింత బాధ్యతగా ఉండాలి. పాఠాలు, వాటిలోని ప్రయోగాలు రాసేటప్పుడు అత్యంత సున్నితంగా వ్యవహరించాలి. కానీ నాలుగోతరగతి సైన్స్ పుస్తకం రాసిన వాళ్లెవరో గానీ.. ఆ విషయాన్ని గాలికి వదిలేశారు. సజీవాలు గాలి పీల్చుకుంటాయని చెప్పడానికి వాళ్లు చేయమన్న ప్రయోగం చూస్తే ఒక్కసారిగా ఒళ్లు జలదరిస్తుంది. సజీవాలు బతికుండాలంటే గాలి పీల్చుకోవాలని, గాలి లేకుండా ఏ జీవీ కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సేపు బతకలేదని చెప్పారు. ఈ విషయాన్ని నిరూపించడానికి వాళ్లు ఓ ప్రయోగం చేయాల్సిందిగా చిన్నారులకు సూచించారు. ఆ ప్రయోగం ఇలా ఉంది..
 
''రెండు చెక్క పెట్టెలు తీసుకోవాలి. ఒక పెట్టె మూత మీద కన్నాలు చేయాలి. రెండోదానికి కన్నాలు లేకుండా చూసుకోవాలి. రెండు పెట్టెల్లోనూ రెండు పిల్లి పిల్లలను పెట్టాలి. మూతలు వేసేయాలి. కొంతసేపటి తర్వాత ఆ మూతలు తీసి చూస్తే, కన్నాలు లేని పెట్టెలో ఉండే పిల్లిపిల్ల చనిపోయి ఉంటుంది'' అని ఆ పాఠ్య పుస్తకంలో రాశారు.
 
 
ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అఖ్తర్ గమనించి, ఇంత బాధ్యతారహితంగా ఎలా ఉంటారంటూ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. నాలుగో తరగతి పర్యావరణ శాస్త్రంలో ఇది ఉందని, పిల్లలకు ఇలాంటి పుస్తకాలు చేరడానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించాడు. నటీనటులు సామాజిక బాధ్యతతో వ్యవహరించి ఇలాంటి విషయాలను పదిమంది దృష్టికి తీసుకురావడం వల్ల కొంతవరకు ఉపయోగం ఉంటోంది. ఇంతకుముందు దర్శకురాలు రేణు దేశాయ్ కూడా పలు విషయాల మీద ఇలాగే స్పందించి తన అభిప్రాయాలు చెప్పారు.
మరిన్ని వార్తలు