క్లీన్ ఇండియా

20 Nov, 2015 02:24 IST|Sakshi
క్లీన్ ఇండియా

సాక్షి, హైదరాబాద్: సంపూర్ణ పారిశుద్ధ్యంపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పరిశుభ్రమైన భారతావనిని ఆవిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిమ్స్‌మేలో నిర్వహించిన ‘లైఫ్‌స్కిల్స్ అండ్ లైవ్లీహ డ్ స్కిల్స్’సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. అందరూ వివిధ స్థాయిల్లో అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాతో పాటు క్లీన్ ఇండియాకు కూడా అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. స్వేచ్ఛా భారతం కన్నా స్వచ్ఛ భారతే మిన్న అన్న గాంధీజీ ఆశయాన్ని నెరవేర్చేందుకు స్వచ్ఛభారత్ క్యాంపెయిన్‌ను కేంద్రం చేపట్టిందన్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలలల్లో ప్రతి 20 మంది విద్యార్థులకు కనీసం ఒక టాయిలెట్ ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.

దేశవ్యాప్తంగా 11 కోట్ల 11 లక్షల మరుగుదొడ్లు నిర్మించేందుకు రూ. 62 వేల కోట్లు వ్యయం చేయబోతోందన్నారు. వారానికి రెండుగంటల చొప్పున ఏడాదికి 100 గంటల పాటు ప్రతి వ్యక్తి పారిశుద్ధ్యానికి ప్రాధన్యమివ్వాలని ప్రధాని ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ అందుకొని ముందుకు సాగాలన్నారు.
 నైపుణ్యాలు అవసరం
 ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ.. పటిష్టమైన భారత్‌ను నిర్మించాలంటే జీవన, జీవనోపాధుల నైపుణ్యాలు అవసరమన్నారు.

డిగ్రీ పూర్తిచేసిన ప్రతి ముగ్గురిలో ఒకరికి ఉపాధి పొందేందుకు అవసరమై నైపుణ్యం(స్కిల్) ఉండటం లేదన్నారు. అలాగే, ఆరోగ్యం పట్ల ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరులక్షల కుటుంబాల్లో మరుగుదొడ్లు లేక వృద్ధులు, గర్భిణులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో 140 రోజుల్లో 20,174 మరుగుదొడ్లు కట్టి గిన్నిస్‌బుక్ రికార్డు సాధించామన్నారు.

ప్రస్తుతం శ్మశాన వాటికల అభివృద్ధిని చేపట్టానన్నారు. పాఠశాలల్లోనూ మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని కోడెల చెప్పారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశే ్వశ్వర్‌రెడ్డి, ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, మాజీ మంత్రి జి.వినోద్, యునిసెఫ్ ప్రతినిధి రీతూలియో, సదస్సు కో చైర్మన్ డాక్టర్ రవిరెడ్డి, సెంటినెల్ వర్సిటీ వ్యవస్థాపకుడు రిచర్డ్ అలీవర్ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు