సౌదీలో స్తంభించిన జనజీవనం

10 Nov, 2013 02:18 IST|Sakshi
సౌదీలో స్తంభించిన జనజీవనం

రియాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సౌదీ అరేబియా తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టం ‘నతాఖా’ ప్రభావంతో అక్కడ చాలా వరకు జనజీవనం స్తంభించిపోయింది. సరైన పత్రాలు లేక (వర్క్ పర్మిట్ లేక) అరెస్టవడంతో పాటు, అవగాహన లేక పెద్ద సంఖ్యలో కార్మికులు ఇళ్లకే పరిమితం కావడంతో.. వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమలను మూసి ఉంచాల్సి వస్తోంది. దాంతో ప్రధాన నగరాలైన జిద్దా, రియాత్, దమ్మామ్, హల్-కోబర్, మక్కా, మదీనా తదితర ప్రాంతాల్లో  కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో వలస వచ్చినవారితో పాటు, సౌదీ అరేబియా ప్రజల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టం కింద అరెస్టయిన కార్మికుల్లో ఎక్కువగా ప్లంబర్లు, పెయింటర్లు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, క్లీనర్స్, స్వీపర్లు ఉన్నారు. దాంతో చాలా సంస్థలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, కార్యాలయాల్లో కిందిస్థాయి సిబ్బంది రాకపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయి, సౌదీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉద్యోగ వీసాపై వెళ్లిన ఉద్యోగులు తమ కఫిల్‌ల నుంచి ఫ్యామిలీ వీసా అనుమతి తీసుకొని భార్యాపిల్లలను సౌదీ అరేబియాకు తీసుకెళ్లారు. వారిని భారత ఎంబసీ స్కూళ్లలో, స్థానిక ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా చేర్పించారు. కానీ, ‘నతాఖా’ చట్టంతో వారంతా పాఠశాలలకు వెళ్లకపోవడంతో చాలా స్కూళ్లు మూతపడ్డాయి.
 
 చట్టంపై అవగాహన లేకనే..
 
 సౌదీ అరేబియాకు వెళ్లిన వారికి తమ వద్ద అఖామా (వర్క్ పర్మిట్) ఉన్నప్పటికీ.. పిలిచిన వ్యక్తి (కఫిల్) పేర్కొన్న పనికి సంబంధించిన వివరాలపై అవగాహన కల్పించే విధానం లేదు. దాంతో ఇప్పుడు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘నతాఖా’ ప్రకారం వర్క్ పర్మిట్‌లో ఏ పని చేస్తారని పేర్కొన్నారో.. కార్మికులు అదే పని మాత్రమే చేయాలి. దీని ప్రకారం అఖామాలో డ్రైవర్‌గా ఉండి.. స్వీపర్ విధులు నిర్వహిస్తున్న వారిని కూడా అరెస్టు చేస్తున్నారు. దీంతో వర్క్ పర్మిట్ ఉన్న కార్మికులు కూడా విధులకు హాజరుకావడానికి భయపడుతున్నారు. నివాసాల్లోనే ఉంటూ బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతో పాటు, అక్కడి స్థానిక భాష అరబ్బీ రాకపోవడంతో విదేశాల కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి వర్తించదనే విషయాలపై అక్కడి ప్రభుత్వం.. అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో విదేశీ కార్మికులు, ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
 
 25 వేల మంది అరెస్టు? : ఇప్పటి వరకు అక్రమంగా ఉంటున్న 25 వేల మందిని అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియా ప్రభుత్వ ప్రతినిధి అల్ మన్సూర్ టర్కీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా ఎంతమంది అక్రమంగా నివాసం ఉంటున్నారో ఇకపై అరెస్టులతో తెలుస్తుందన్నారు.అరెస్టయిన వారిలో చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రశ్నించగా... వారికి సౌదీ ప్రభుత్వం ద్వారా ఉచితంగా వైద్యం చేయిస్తామని ఇప్పటికే సౌదీ రాజు ప్రకటించారని చెప్పారు. విదేశీయుల మాన, ప్రాణ రక్షణ విషయంలో సౌదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కేవలం అక్రమంగా ఉంటున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు.
 
 వారం రోజులుగా రెస్టారెంట్ మూతపడింది..
 ‘‘వారం రోజులుగా మా రెస్టారెంట్‌ను మూసి ఉంచాల్సి వస్తోంది. మా రెస్టారెంట్‌లో పని చేస్తున్నవారికి వర్క్ పర్మిట్‌లు ఉన్నాయి. కానీ, పర్మిట్లలో పేర్కొన్న పనుల్లో వారు లేరు. ‘నతాఖా’ అరెస్టులకు భయపడి ఎవరూ విధులకు రావడం లేదు. దాంతో వారికి స్పాన్సర్‌షిప్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నాం. విదేశీయులు తక్కువ వేతనాలకు పనిచేస్తారు. అదే ఈ చట్టం ద్వారా స్థానికులకు ఉద్యోగాలిస్తే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుంది. దాంతో నష్టాల పాలవుతాం.’’
 - అలీ హద్దాద్, జిద్దా రెస్టారెంట్ మేనేజర్
 
 సౌదీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి..
 ‘‘నేను మూడేళ్లుగా రియాద్‌లో ఉంటున్నాను. నేను వచ్చినప్పుడు నా కఫిల్ (నాకు వీసా ఇచ్చిన వ్యక్తి) నా పాస్‌పోర్టును తన వద్ద ఉంచుకొని అఖామా (వర్క్ పర్మిట్)ను ఇచ్చాడు. ఆ అఖామాలో తన కంపెనీలో పని కోసం పిలిచినట్లుగా ఉంది. కానీ, ఆయన నాకు తన కంపెనీలో ఉద్యోగం ఇవ్వకుండా, బయట పని చేసుకొమ్మన్నాడు. దాంతో ఒక ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు అఖామా ఉంది. కానీ, కొత్త చట్టం కింద నన్ను అరెస్ట్ చేసే అవకాశముంది. కఫిల్ తప్పుతో నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది సౌదీ ప్రభుత్వం నిర్లక్ష్యం. ఆ చట్టంలో మార్పులు చేయాలి.’’
 - నహీం సిద్ధిఖీ, రియాద్, ఆటో మోబైల్ కంపెనీ వర్కర్.
 

>
మరిన్ని వార్తలు