పిట్టలదొర తుపాకీ పేలుతుందా?

12 Sep, 2016 01:23 IST|Sakshi
పిట్టలదొర తుపాకీ పేలుతుందా?

బాబు కరువును జయించారా?
- రెయిన్ గన్లతో 4.69 లక్షల ఎకరాల్లో పంటలను కాపాడామన్న సీఎం

సాక్షి ప్రతినిధి, అనంతపురం/హైదరాబాద్: పిట్టల దొర చేతిలోని కట్టె తుపాకీ పేలుతుందా? అతడి నోటి నుంచి కోతలే తప్ప తుపాకీ నుంచి తూటాలు రావు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అలాంటి గొప్పలే చెప్పుకుంటున్నారు. ఆయన ప్రవేశపెట్టిన రెయిన్ గన్లు రాయలసీమలో 4 రోజుల్లో 4.69 లక్షల ఎకరాల్లోంచి కరువు రక్కసిని తరిమికొట్టాయట! నిజంగా ఈ గన్లకు భయపడి కరువు పారిపోయిందా? లేక సీఎం మాటలు కోటలు దాటాయా? ఇందులో నిజమెంతో ఒక్కసారి లెక్క చూద్దామా...
 

 రాయలసీమలో 4.69 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను రెయిన్ గన్లతో రక్షించామని సీఎం చెప్పారు. నిజానికి ఈ 4.69 లక్షల ఎకరాల్లో పంటలకు ఒక తడి ఇవ్వాలంటే దాదాపు 10 టీఎంసీల నీరు అవసరం. కరువు సీమలో 4 రోజుల్లో ఇంత నీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో సీఎంకే తెలియాలని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఒక టీఎంసీ (2,831.68 కోట్ల లీటర్లు) నీటి సరఫరాకు 10 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్లు 28.31 లక్షలు కావాలి. ఇక 10 టీఎంసీల నీటిని పంటలకు పారించాలంటే 2.83 కోట్ల ట్రిప్పుల ట్యాంకర్లు అవసరం. రెయిన్ గన్ల ద్వారా పంటలకు నీరు సరఫరా చేసేందుకు అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి తీసుకొచ్చిన ట్యాంకర్లు అత్యధికంగా వెయ్యి. ఇవి కూడా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయి. తర్వాత తగ్గించారు. సీమలో తక్కిన 3 జిల్లాల్లో కలిపి మరో వెయ్యి ట్యాంకర్లు కూడా లేవు. ఇవి కూడా 3 నుంచి 5 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్రాక్టర్ ట్యాంకర్లే. నాలుగు రోజుల్లో 10 టీఎంసీల నీళ్లు ఇచ్చే అవకాశం రాయలసీమలో ఉందా? నిజంగా అక్కడ అంత నీరుందా? ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలతో తమ చెవుల్లో పువ్వులు పెడుతున్నారని రాయలసీమ రైతులు మండిపడుతున్నారు.
 

 ఫలితం లేని ప్రయోగం: రాయలసీమలో ప్రధాన పంట వేరుశనగ. సీమలో ఈ ఏడాది 21.55 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. 95 రోజుల్లో చేతికొచ్చే ఈ పంటకు  నెలకోసారి మంచి వర్షం అవసరం. కానీ, జూలై 28 తర్వాత సీమలో వర్షమేలేదు. ఆగస్టు 18 నాటికి 12.42 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఆగస్టు 6న ధర్మవరం, 15న అనంతపురానికి సీఎం బాబు వచ్చారు. పంట ఎండకుండా రెయిన్ గన్లతో కాపాడతామన్నారు. అప్పటికీ ఎండిన పంట 17.52 లక్షల ఎకరాలకు చేరింది. కృష్ణా పుష్కరాలు ముగిసిన తర్వాత 28న తీరిగ్గా సీఎం అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. రెయిన్‌గన్లను ప్రారంభించారు. అప్పటికే ఆలస్యమై నీటి తడులిచ్చినా పంట చేతికి రాని పరిస్థితి. వాస్తవానికి రాయలసీమలో 17.52 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట ఎండిపోయింది. అయితే, 4.69 లక్షల ఎకరాల్లో పంటలను రెయిన్‌గన్ల ద్వారా కాపాడామని ముఖ్యమంత్రి చెప్పారు.
 

 సీఎంకు తెలియదనడం పచ్చి అబద్ధం
రాష్ట్రంలో పంటల పరిస్థితి, వర్షాభావం వివరాలను అధికారులు తనకు సకాలంలో తెలియజేయలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. వాస్తవానికి ప్రతి బుధవారం వ్యవసాయ శాఖ రాష్ట్రంలో పంటల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇస్తుంది. ఎక్కడెక్కడ పంటలు ఎండుతున్నాయో దీన్ని బట్టి నిర్ధారించవచ్చు. ఇంత సమాచారం తన వద్ద పెట్టుకుని అధికారులు తనకు చెప్పలేదని సీఎం అనడం అన్యాయమని వ్యవసాయ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
 

 రూ.160 కోట్లతో రెయిన్ గన్లు
వర్షాభావ పరిస్థితులను రెయిన్ గన్లతో ఎదుర్కొంటా మని ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసింది. ఈ ఏడాది వీటి కొనుగోలుకు  రూ.160.54 కోట్లు, వాటి నిర్వహణ కోసం రూ.103 కోట్లు ఖర్చు పెట్టింది. పంట లను కాపాడేందుకు  13,334 రెయిన్ గన్లను ప్రవేశపెట్టింది. వీటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులకు అద్దెకు ఇస్తుంది. రైతులే కొనుక్కుంటామంటే వారి కున్న పొలాన్ని బట్టి రాయితీ ఇస్తుంది.
 

 కొనుగోళ్లలో అవినీతి!
రాష్ట్ర ప్రభుత్వం రెయిన్ గన్ల సరఫరా బాధ్యతను ఉద్యానవన శాఖ కమిషనర్‌కు అప్పగించింది. దీంతో ఆ అధికారి సూక్ష్మ నీటి పారుదల పథకం కింద తొలి విడతలో 1,500 రెయిన్ గన్ల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. మొత్తం 9 సంస్థలు టెండర్లు దాఖలు చేయగా జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ (మహారాష్ట్ర), క్రిషీ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీ) అనే 2 సంస్థలతో తుది జాబితా తయారు చేశారు. నిబంధనల ప్రకారం ఈ టెండర్ ఏపీ సంస్థకు దక్కాల్సి ఉన్నా సూక్ష్మ నీటిపారుదల శాఖలో కీలక వ్యక్తి చక్రం తిప్పి మహారాష్ట్ర సంస్థకు దక్కేలా చేశారు. దీనివెనుక  రూ.లక్షలు చేతులు మారాయని పలు సంస్థలు ఆరోపించాయి. 
 

 ఇన్‌ఫుట్ సబ్సిడీకి మంగళం?
సీమలో జూన్‌లో సాగైన వేరుశనగ పంట మొత్తం ఎండిపోయింది. జూలై ప్రథమాంకంలో సాగైన పంట దీ ఇదే పరిస్థితి. ఆగస్టు 20కే పంట పరిస్థితి చేజారిపోయింది. ఈ క్రమంలో ఆగస్టు 29 రాత్రి వర్షం కురిసింది. ఈ వర్షంతో జూన్‌లో సాగుచేసిన పంటకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. జూలై మొదట్లో సాగుచేసిన పంటకూ ప్రయోజనం లేదు. ఆపై సాగుచేసిన పంట 50 శాతం దిగుబడి తగ్గుతుంది. ఆగస్టు 28న రెయిన్ గన్లను ప్రారంభిన తర్వాత 30న వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ రెయిన్‌గన్లతో రూ.199.34 కోట్ల విలువైన పంటను కాపాడామన్నారు. తద్వారా ప్రభుత్వానికి రూ.42.92 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఆదా చేశామన్నారు. ఈ నెల 1న అనంతపురం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చేకంటే ముందుగానే పంటను కాపాడామన్నారు. దీన్నిబట్టి ఇన్‌పుట్ సబ్సిడీకి మంగళం పాడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
 

 ‘సీమ’ పొలాలకు నిరుపయోగం
రాయలసీమలోని వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో కొందరు రైతులు ఎనిమిదేళ్లుగా రెయిన్ గన్లను వినియోగిస్తున్నారు. వేరుశనగ పంటకు ఇవి ఏమాత్రం ఉపయోగకరం కాదని శాస్త్రవేత్తలు తేల్చారు.

  రెయిన్ గన్‌కు కనీసం 3 ఇంచుల నీరు అవసరం. అప్పుడే అది ఒత్తిడితో పనిచేస్తుంది. కానీ, రాయలసీమలోని 78 బోర్లలో 1.5 ఇంచుల నీరే అందుబాటులో ఉంది. ఈ నీటితో రెయిన్ గన్ పనిచేయదు.
 

రెయిన్ గన్.. కొత్తదేమీ కాదు
రెయిన్ గన్ల ప్రయోగం కొత్తదేమీ కాదు. మా పరిశోధనా క్షేత్రంలో రెయిన్ గన్లను పదేళ్ల నుంచి ఉపయోగిస్తున్నాం. దీన్ని చూసి చాలా మంది రైతులు పశు గ్రాసాన్ని రెయిన్ గన్లతో సాగు చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగిస్తున్న రెయిన్ గన్ నిమిషానికి 240 లీటర్ల చొప్పున 24 మీటర్ల చుట్టూ వృత్తాకారంలో నీటిని చిమ్ముతుంది. ఇది విడతకు 1,809 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గంటకు 14,400 లీటర్ల నీటిని వెదజల్లుతూ పంటకు తడిని అందిస్తుంది. ఇది కేవలం 8 మిల్లీమీటర్ల వర్షపాతానికి సమానం. అనంతపురం వంటి జిల్లాలోని తేలికపాటి ఎర్ర భూముల్లో ఈ నీటి పరిమాణం ఏమాత్రం సరిపోదు. మెట్ట ప్రాంతాల్లో బెట్టకు గురైన పంటలకు కనీసం 30 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం. ఇది కనీసం భూమిని 15 సెంటీమీటర్ల లోతు వరకు తడుపుతుంది.
 

 ట్యాంకర్లతో నీటి సరఫరా జరిగే పనికాదు
ఎర్ర భూములకు నీటి  తడిని పెట్టాలంటే రెయిన్ గన్లు కనీసం 3 గంటల 45 నిమిషాలపాటు పనిచేయాలి. కనీసం రెండు మూడు సార్లు షిఫ్ట్ పద్ధతిలో వీటిని పని చేయించాలి. ఎకరాకు 30 మిల్లీమీటర్ల వర్షపాతానికి సమానమైన నీటి తడిపెట్టాలంటే 1,21,500 లీటర్ల నీరు కావాలి. ఇది 20 ట్యాంకర్లకు(ట్యాంకర్ 6 వేల లీటర్లు) సమానం. అయితే, ట్యాంకర్ల ద్వారా నీటిని తోడి వ్యవసాయ భూములను తడపడం జరిగే పనికాదు. దాని ఫలితాలు రైతులందరికీ చేరవు కూడా.
- డా.శ్రీనివాస్‌రెడ్డి, ‘క్రిడా’ ప్రధాన శాస్త్రవేత్త
 

 రెయిన్ గన్ అంటే?
ఇది బిందు, తుంపర సేద్యానికి ఉపయోగించే పరికరం లాంటిదే. నిజానికి ఇదొక సూక్ష్మ నీటి పారుదల పరికరం. తక్కువ నీటిని ఎక్కువ విస్తీర్ణంలో విరజిమ్మడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఆరు అడుగుల ఎత్తున ఓ రెయిన్‌గన్‌ను అమర్చితే దాని చుట్టుపక్కల సుమారు 45 మీటర్ల వరకూ నీటిని విరజిమ్మవచ్చు. 45 సెంట్ల పొలాన్ని తడిపేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. అదే అర ఎకరాకు మామూలు పరిస్థితుల్లో నీరు పెట్టాలంటే సుమారు 4 గంటల సమయం పడుతుంది. రెయిన్ గన్‌కు 5 హెచ్‌పీ ఇంజన్ కావాలి. ఇందుకోసం ఆయిల్ ఇంజన్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. నీళ్లున్న చోటు నుంచి రెయిన్ గన్ వరకు సరఫరా చేసేందుకు హెచ్‌డీపీఇ, క్యూపీసీ పైపులను ఉపయోగిస్తారు. పంటను బట్టి రెయిన్ గన్ స్టాండ్లను ఏర్పాటు చేస్తారు. పొలం సమీపంలో బోర్లు, బావులు, కాలువలు, చెరువుల్లో నీరున్నప్పుడే వీటిని వినియోగించడం సాధ్యమవుతుంది. లేకుంటే ఎక్కడి నుంచైనా ట్యాంకర్లతో తెచ్చుకోవాలి. రెయిన్ గన్లు మెట్ట పంటలకే ఉపయోగకరం. వరి వంటి వాటికి పనికిరావు.  రెయిన్ గన్ ఉపయోగించాలంటే ఎకరాకు కనీసం 2.5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న కుంట కావాలి. అలా నీళ్లున్నప్పుడే రెయిన్ గన్‌ను ఉపయోగించే వీలుంటుంది. ఎక్కడి నుంచో నీటిని తీసుకొచ్చి చేలను తడుపుతామనడం అశాస్త్రీయమని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు