సీఎం జిల్లాలోనే ఆత్మహత్యలు

1 Oct, 2015 01:57 IST|Sakshi

మండలిలో కాంగ్రెస్ సభ్యులు
ఈ పరిస్థితికి మీ పాలనే కారణం: టీఆర్‌ఎస్  

 
 సాక్షి, హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై బుధవారం శాసనమండలిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సభ్యులు ఫారుఖ్ హుస్సేన్, ఎమ్మెస్ ప్రభాకర్, టీఆర్‌ఎస్ సభ్యులు కె.యాదవరెడ్డి, పాటూరి సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్, శ్రీనివాస్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్ మధ్య సంవాదం చోటు చేసుకుంది. సీఎం సొంత జిల్లాలో రైతులు పెద్దఎత్తున ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్ సభ్యులు ప్రస్తావించగా.. కాంగ్రెస్ పాలన వైఫల్యం కారణంగానే ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయని టీఆర్‌ఎస్ సభ్యులు విమర్శించారు.

వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఎంత సాగు చేశారో, ఇప్పుడెంత సాగు చేస్తున్నారో చర్చకు సిద్ధమని కాంగ్రెస్ సభ్యులు అన్నారు. తెలంగాణ వస్తే చీకట్లేనని కిరణ్ పెద్దఎత్తున ప్రచారం చేశారని, అయితే అందుకు విరుద్దం గా కరెంట్ సమస్య తీరిపోయిందని మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు.‘యుద్ధం, మౌనం రెండు అస్త్రాలు. అన్నీ తెలిసిన వ్యక్తి కేసీఆర్. ఎప్పుడు గర్జించాలో అప్పుడు గర్జిస్తారు’ అని సుధాకరరెడ్డి అనగా..‘ఇదేమన్నా కురుక్షేత్ర మా? మాతో పోట్లాడడానికి. మీ సీఎం గద తీసుకొస్తే ఏమీ చేయాలో మాకు తెలుసు. రైతులకు భరోసా కల్పిద్దామని మేం అంటే.. మీరు యుద్ధం అనడం ఏమిటి?’ అని షబ్బీర్ నిలదీశారు.

 ఆంధ్రోళ్లే కారణమంటే ఎలా?
 తెలంగాణ ఏర్పడి 16 నెలలవుతున్నా.. ప్రస్తుత సమస్యలకు కూడా ఆంధ్రోళ్లే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తుండడం సబబు కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి అన్నారు. ఆత్మహత్యల నిరోధానికి శాస్త్రీయమైన ఆలోచన చేయాల న్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. పంటలు నష్టపోయి, అప్పులు తీరక ఆత్మహత్య చేసుకునే పరిస్థితులున్న రైతు కుటుంబాలను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి  విజ్ఞప్తి చేశారు.

 ముఖ్యమంత్రి చంద్రబాబు!
 తెలంగాణను కరెంటు కోతలు లేని రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు  పొరపాటున అనడంతో మండలి సభ్యులంతా అవాక్కయ్యారు.  వెంటనే తన తప్పును సరిదిద్దుకొని.. సీఎం చంద్రశేఖర్‌రావు అని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు ఇతర రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు