చిన‘బాబు’ లెక్కలు చిత్ర విచిత్రాలు

20 Oct, 2016 02:38 IST|Sakshi
చిన‘బాబు’ లెక్కలు చిత్ర విచిత్రాలు

- ఆస్తుల పేరిట మరోసారి లోకేశ్ సొంతలెక్కలు
- చంద్రబాబుకు భవనాన్ని బహుమతిచ్చిన కుటుంబం
- హెరిటేజ్‌లో వాటాల మార్కెట్ విలువే రూ.932 కోట్లు
- కొన్న విలువంటూ రూ.33 కోట్లుగానే పేర్కొన్న చినబాబు
- భారీ భవంతులకూ నామమాత్రపు ధరనే చూపిన తీరు
- తాజాగా కొన్న వాటి విషయంలోనూ అదే తీరు
- ఇదే ఏడాదిలో అంత తక్కువ ధరకు ఎలా కొన్నారో చెప్పరు
- రూ.100 కోట్ల విలువైన భూమి... ఇప్పటికీ రూ.79 లక్షలేనట!
- వినేవారుంటే... తీరులో సాగిన లోకేశ్ ఆస్తుల లెక్క
 
 సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం పుత్రోత్సాహం కుదిపేసి ఉంటుంది. కుటుంబ ఆస్తుల పేరిట నోటికొచ్చిన లెక్కలు చెప్పిన పుత్రరత్నాన్ని చూసి... తాను రెండెకరాలతో మొదలెడితే తన వారసుడు రెండాకులు ఎక్కువే చదివాడని ఉప్పొంగిపోయి ఉంటారు. తాము చెప్పిందల్లా ప్రచారం చేయటానికి నాయక గణం, అనుకూల మీడియా ఉంటే ఉండొచ్చు. కానీ జనం సైతం దాన్ని పిచ్చిగా నమ్మేస్తారన్న ఈ తండ్రీకొడుకుల నమ్మకమే అన్నిటికన్నా హైైలైట్. మాట తప్పకపోవటమంటే ఏంటన్నది వీళ్లనే అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో పదిహేనేళ్ల కిందట జూబ్లీ హిల్స్‌లో పాతిక లక్షలకు కొన్న భవనం... ఇపుడు యాభై కోట్లు పలుకుతున్నా చంద్రబాబు, లోకేశ్ బాబు ఇద్దరూ దాని విలువ పాతిక లక్షలనే చెబుతున్నారు.పాతికేళ్లు గడిచాకా దాని విలువ రూ.100 కోట్లు దాటేసినా వారు మాట తప్పరు. పాతిక లక్షలనే చెబుతారు!. అదీ బాబు కుటుంబమంటే!!.

 ఏడాదికోసారి తప్పనిసరి తద్దినంలా అవే లెక్కల్ని వల్లెవేయటం ఎందుకనే సందేహం ఎవరికొచ్చినా బాబు కుటుంబానికైతే రాదు. వరసగా రెండో ఏడాది... బుధవారం లోకేశ్ బాబు చెప్పిన లెక్కల్లో ఐదారు తప్ప అన్నీ పాతవే. విశేషమేంటంటే పాతవాటికి కూడా తనదైన చిత్రాల్ని జోడించారు చినబాబు. అవేంటో ఒకసారి చూద్దాం...

 చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చిందెవరు?
 హా తండ్రి చంద్రబాబు ఆస్తుల్ని ప్రకటించిన లోకేశ్... నారావారి పల్లెలో దాదాపు ఎకరం స్థలంలో భవనం కడుతున్నామని చెప్పారు. దీన్ని కుటుంబం నుంచి వచ్చిన గిఫ్ట్‌గా పేర్కొన్నారు. కుటుంబమంటే? బాబుకు తల్లిదండ్రుల నుంచి భూమి సంక్రమించి ఉండొచ్చు. కానీ ఈ ఏడాదే కట్టిన భవనాన్ని బాబుకు గిఫ్ట్ ఇచ్చేదెవరు? భార్య భువనేశ్వరా? లేక చినబాబా? అందుకేనేమో!! దీని విలువను మాత్రం లోకేశ్ చెప్పలేదు.

 భువనేశ్వరికి హెరిటేజ్‌లో వాటా ఎంత?
  భువనేశ్వరి పేరిట పంజాగుట్టలోని భవనం, తమిళనాడులోని ఆస్తుల సహా అన్నిటికీ పాత విలువలే చెప్పగా...హెరిటేజ్ ఫుడ్స్‌లో తనకున్న వాటా విలువను కూడా రూ.19.95 కోట్లుగానే చూపించారు. నిజానికి ఆమెకున్న 53,30,826 షేర్లకు బుధవారంనాటి మార్కెట్ విలువ (రూ.902 చొప్పున) రూ.480 కోట్లపైనే. భూములు, భవనాలు, షేర్ల మార్కెట్ విలువ తరచూ మారుతుంటుంది కనక తాము కొన్నప్పటి విలువనే చూపిస్తున్నామన్నది లోకేశ్ మాట. మరి పాతికేళ్ల కిందటి విలువల్నే ఇప్పటికీ చూపించాలనుకుంటే ఏటా ఈ లెక్కలెందుకు చెప్పటం? ఈ మధ్యే హెరిటేజ్ ఫుడ్స్‌లో వాటాను ఫ్యూచర్ గ్రూప్‌కు విక్రయించడానికి చర్చలు కూడా జరిగాయి. మరి బాబు కుటుంబం తమ వాటాకు మార్కెట్ విలువ ప్రకారం లెక్కగడుతుందా? లేక తాము కొన్నప్పటి విలువ ఇస్తే చాలంటుందా? ఎవరిని మోసం చేయటానికిదంతా?

► భువనేశ్వరి వద్దనున్న బంగారం, ఆభరణాలకు గతేడాది చెప్పిన విలువ రూ.26.96 లక్షలు. ఇపుడైతే రూ.1.27 కోట్లుగా పేర్కొన్నారు. చిత్రమేంటంటే గతేడాది తమ వద్ద 3,380 గ్రాముల బంగారం ఉందని చెప్పగా ఈ సారి 3519 గ్రాములని చెప్పారు. అంటే ఈ ఏడాదిలో పెరిగిన 139 గ్రాముల విలువ రూ.కోటి అవుతుందా? లేక మార్కెట్ విలువ ప్రకారం లెక్కించారా? లోకేశ్‌కే ఎరుక!!.

 లోకేశ్... ఇప్పటికీ నానమ్మ పేరే!!
 జూబ్లీహిల్స్‌లో ప్లాటు విలువను గతేడాది రూ.2.36 కోట్లుగా చూపించిన లోకేశ్... ఇపుడు స్వల్పంగా పెంచి రూ.3.68 కోట్లుగా చెప్పారు. కొన్నప్పటి విలువనే చూపిస్తున్నామన్నపుడు ఇదెలా పెరిగింది? నోటికొచ్చినట్టు చెప్పటమేనా ఆ లెక్క?
► మదీనాగూడలో ఐదెకరాల్ని కొన్నానని, ఐదెకరాలు మాత్రం నానమ్మ నుంచి గిఫ్ట్‌గా వచ్చిందని లోకేశ్ చెబుతుంటారు. పసుపు కుంకుమగా వచ్చిన అరెకరం తప్ప ఏమీ ఆస్తుల్లేని అమ్మణ్ణమ్మ... లోకేశ్‌కు అంత బహుమతి ఎలా ఇచ్చారో మాత్రం ఏ బాబూ చెప్పరు.
► విశేషమేంటంటే ముంబయి శివార్లలో తనకున్న స్థలం విలువను రెండుమూడేళ్ల పాటు రూ.58.69 లక్షలుగానే చూపించారు లోకేశ్. ఈ సారి విక్రయించేసినట్లున్నారు. అసలు ఎంతకు విక్రయించారు? కోట్ల విలువైన ఆ స్థలాన్ని రూ.58 లక్షలకే విక్రయించేశారా?
► ఇక హెరిటేజ్ ఫుడ్స్‌లో తనకున్న 23,66,400 షేర్ల విలువను రూ.2.21 కోట్లుగా చూపించారు. కానీ దాని అసలు విలువ రూ.212 కోట్లు. అదీ చినబాబు లెక్కంటే!!.

 బ్రాహ్మణి... స్థలానికి బదులు భవనమా?
 ఈ సారి బ్రాహ్మణి ఆస్తుల్లోకి కొత్తగా ఓ ప్లాటొచ్చి చేరింది. జూబ్లీహిల్స్‌లో 650 గజాల్లో ఏకంగా 6,000 చదరపు అడుగులు నిర్మించి ఉన్న భవనం తన పేరిట చూపించారు. రూ.3.5 కోట్లుగా దాని విలువను చూపిస్తూ... ఎక్స్‌చేంజ్ డీడ్‌గా పేర్కొన్నారు. గతేడాది చూపించిన ఆస్తుల్లో నందగిరి హిల్స్‌లో 778 గజాల స్థలం ఉంది. ఇపుడది లేదు. అంటే ఈ స్థలాన్నిచ్చి ఆ భవనాన్ని తీసుకున్నారా?
► విశేషమేంటంటే వివాదాస్పద ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో 2,440 గజాల స్థలం విలువను గతేడాది 1.15 కోట్లుగా చూపించారు. ఈ సారి రూ.1.23 కోట్లన్నారు. ఇదెక్కడి లెక్క?
►మరో చిత్రం కూడా ఉంది. మాదాపూర్‌లోని 924 గజాల ప్లాటు విలువను గతేడాది 3.37 లక్షలుగా చూపించారు. ఈ సారి రూ.17 లక్షలుగా చూపించారు. ఇది మార్కెట్ విలువా లేక కొన్నప్పటి విలువా? కొన్నప్పటి విలువైతే రూ.3.37 లక్షలే ఉండాలి కదా? మార్కెట్ విలువైతే గతం రూ.80 వేలు వేసుకున్నా 80 లక్షలుండాలి కదా!!.
► హెరిటేజ్ ఫుడ్స్‌లో బ్రాహ్మణి వాటా విలువను 78 లక్షలుగా పేర్కొనగా... దాని అసలు విలువ 9.09 కోట్లు. 
► లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడుల పేరిట ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియాలో రూ.70 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. ఎల్‌ఐసీ అనుబంధ సంస్థ ఎల్‌ఐసీ హోమ్‌ఫైనాన్స్ మాత్రమే లిస్టయింది. మరి ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియాలో వీళ్లకెవరు వాటా అమ్మారన్నది లోకేష్‌కే ఎరుక.
► 97 కిలోల వెండి ధరను గతేడాది 3.3 లక్షలుగా... ఈ సారి రూ.12.37 లక్షలు చూపించారు. మరి ఏడాదిలో వెండి ధర 4 రెట్లు పెరిగిందా?

 దేవాన్ష్‌కూ నానమ్మ బహుమతే!!
 ఈ సారి నారా కుటుంబ ఆస్తుల జాబితాలోకి కొత్తగా వచ్చి చేరింది బాబు మనవడు దేవాన్ష్. తనకు జూబ్లీహిల్స్‌లో 1191 చ. గజాల స్థలం. దాన్లో 19,500 చదరపుటడుగుల భవనం కలిపి ఉన్నాయని దాన్ని ఈ ఏడాదే రూ.9 కోట్లకు కొన్నామని చెప్పారు. చ. అడుగుకు రూ.1,500 నిర్మాణ ఛార్జీలు వేసుకున్నా దాదా పు రూ.3 కోట్లు. స్థలం విలువ కనీసం 25 కోట్లు. మరి 9 కోట్లకు ఎవరిచ్చారు? దీన్ని నానమ్మ భువనేశ్వరి బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులోనూ వారసత్వమేనా!!.
 చివరిగా నిర్వాణా హోల్డింగ్స్‌కు వివిధ కంపెనీల్లో వాటాలున్నాయి. ఒక్క హెరిటేజ్ ఫుడ్స్ లో దానికున్న వాటా విలువే రూ.231 కోట్లు. కానీ దీన్ని 10.82 లక్షలుగా మాత్రమే చూపిం చి.. నిర్వాణాకు 43.95 లక్షల నికర అప్పులున్నట్లు పేర్కొన్నారు. మరీఇంత దారుణమా!!.
 
 మా ఆస్తులు ఇవే: లోకేశ్
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నికర ఆస్తి గత మార్చి 31 నాటికి రూ. 67.04 లక్షలుగా ఆయన కుమారుడు, పార్టీ ప్రధాన కార్యద ర్శి నారా లోకేష్ ప్రకటించారు. తన తల్లి భువనేశ్వరి పేరిట రూ. 24.84 కోట్లు, తన పేరిట రూ. 8.5 కోట్లు, తన సతీమణి  బ్రహ్మణి పేరుతో రూ. 12.33 కోట్లు, కుమారుడు దేవాన్ష్ పేరుతో రూ. 11.32 కోట్ల ఆస్తులుండగా... తాము నిర్వహించే నిర్వాణ హోల్డింగ్స్ కంపెనీ రూ.43 లక్షల లోటులో ఉందని చెప్పారు. ఆయన బుధ వారం గుంటూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుటుంబం ఆస్తులను ప్రకటించారు. మార్కెట్  విలువలు మారుతుంటాయి కాబట్టి ఆస్తులు కొనుగోలు చేసినపుడు ఎంత విలువ ఉందో అంతే ప్రకటించామని చెప్పారు. ఆ వివరాలివే...
 
 నారా చంద్రబాబు నాయుడు
► హైదరాబాద్  జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 65లో ఉన్న 1125  చదరపు గజాల  ఇంటి స్థలం(బ్యాంక్ ఆఫ్ బరోడాలో తనఖాలో ఉంది). నిర్మాణం పురోగతిలో ఉన్న ఇంటి విలువ రూ.3.68 కోట్లు
► చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారి పల్లెలో  కుటుంబ సభ్యుల నుంచి బహుమతిగా వచ్చిన 0.97 ఎకరాల స్థలంలోని  నాలుగింట మూడొంతుల నివాస భవనం. (దీని విలువ పేర్కొన  లేదు)
► అంబాసిడర్ కారు రూ. 1.52 లక్షలు
►ఇతర ఆస్తులు-నేషనల్ స్మాల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు రూ.0.01 లక్షలు
►సేవింగ్స్ బ్యాంక్ ఎకౌంట్‌లో నిల్వ, చేతిలో నగదు:రూ.3.59 లక్షలు
►మొత్తం ఆస్తులు: రూ. 3.73 కోట్లు
►బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఇంటి నిర్మాణ రుణం: రూ.3.06 కోట్లు
►నికర ఆస్తి: రూ. 67.04 లక్షలు
 
 నారా భువనేశ్వరి
► హైదరాబాద్ పంజాగుట్టలో ఆంధ్రాబ్యాంక్ తనఖాలో ఉన్న 650 చ.గ. స్థలం: 73.33 లక్షలు
► తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూరు  సమీపంలో 50 వేల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం  ఉన్న 2.33 ఎకరాల స్థలం (కొటక్ మహీంద్ర బ్యాంక్‌లో తనఖాలో ఉంది): 1.86 కోట్లు
► రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లి మండలం మదీనా గూడ గ్రామంలోని సర్వే నంబర్ 51లో ఉన్న  ఐదు  ఎకరాల భూమి(బ్యాంక్ ఆఫ్ బరోడాలో తనఖాలో ఉంది):  73.80 లక్షలు.
► లిస్టెడ్  కంపెనీల్లో పెట్టుబడులు: హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్‌లో 53,30,826 షేర్లు: 19.95 కోట్లు
► విజయ బ్యాంక్‌లో 100 షేర్లు: 0.02 లక్షలు
► అన్ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు: 3.58 కోట్లు
► పీఎఫ్ ఖాతాలో నిల్వ: 1.73 కోట్లు
► విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు (3.52 కిలోలు) 1.27 కోట్లు
► వెండి 32.7 కిలోలు: 4.57 లక్షలు
► ఆడి కారు:  91.93 లక్షలు
► లిక్విడ్  ఆస్తులు: అడ్వాన్సులు, చెల్లించాల్సినవి : 7.75 కోట్లు
► సేవింగ్స్ బ్యాంక్ ఎకౌంట్‌లో నిల్వ,ఫిక్స్‌డ్ డిపాజిట్లు: 6.41 లక్షలు
► మొత్తం ఆస్తులు: 38.66 కోట్లు
► రుణాలు, అప్పులు: బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఆటు ఇతర బ్యాంకుల్లో: 6.86 కోట్లు
► ఇతర రుణాలు, చెల్లింపులు: 6.95 కోట్లు
► మొత్తం రుణాలు: 13.82 కోట్లు
► నికర  ఆస్తులు: 24.84 కోట్లు
 
 నారా లోకేశ్
► హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 65లో ఉన్న 1,285  చదరపు గజాల  ఇంటి స్థలం (బ్యాంక్ ఆఫ్ బరోడాలో తనఖాలో ఉంది). ఇందులో  తండ్రి చంద్రబాబుతో కలిపి ఇంటి నిర్మాణం పురోగతిలో ఉంది. దీని విలువ రూ.3.68 కోట్లు
► రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనాగూడలో ఉన్న సర్వే నంబర్ 51ఏలో ఉన్న  ఐదు ఎకరాల భూమి (బ్యాంక్ ఆఫ్ బరోడా తనఖాలో ఉంది): నానమ్మ అమ్మణమ్మ  బహుమతిగా ఇచ్చింది.
► ఇదే సర్వే నంబరులోని  ఫాం హౌస్ ( బ్యాంక్ ఆఫ్ బరోడా తనఖాలో ఉంది): 2.21 కోట్లు
► లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు: హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్‌లో 23,66,400 షేర్లు.
► అన్ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు: రూ.1.64 కోట్లు
► మోటారు వాహనాలు:  ఫోర్డ్ ఫియస్టా, రెండు బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్లు: 92.93 లక్షలు
► అడ్వాన్సులు, రావల్సినవి: 3.45 కోట్లు
► సేవింగ్స్ బ్యాంక్ ఎకౌంట్స్‌లో నిల్వ: 5.86 లక్షలు.
► మొత్తం ఆస్తులు: 14.50 కోట్లు
► రుణాలు, అప్పులు:బ్యాంకుల్లో: 7.99 లక్షలు
►ఇతర రుణాలు, అడ్వాన్సులు : 3.21 కోట్లు
►బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇంటి రుణం : 3.06 కోట్లు
►మొత్తం అప్పులు: 6.35 కోట్లు
►నికర ఆస్తులు: 8.15 కోట్లు
 
 నారా బ్రహ్మణి
► రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌లో 924 చదరపు గజాల స్థలం: 17.25 లక్షలు
►జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 19లోని ప్లాట్ నంబరు 459లో ఇల్లు: రూ. 3.50 కోట్లు
► చెన్నై నగరంలోని టెంపుల్ స్టెప్స్‌లో 4,782 చదరపు గజాల వాణిజ్య స్థలం: రూ. 48.00 లక్షలు
► రంగారెడ్డి జిల్లా మణికొండలో 2,440 చదరపు గజాల స్థలానికి చెల్లించిన బయానా: రూ.1.23 కోట్లు
► లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు:-హెరిటేజ్ ఫుడ్స్ ఇండియాలో 1.01 లక్షల షేర్లు: రూ.78.51 లక్షలు.
► ఇతర లిస్టెడ్ కంపెనీల్లో షేర్లు: రూ.70.56 లక్షలు.
► బంగారం 2325.34 గ్రాములు, విలువైన రాళ్లు (310.06 క్యారెట్లు): 15.90 లక్ష లు
► వెండి 97.441 కిలోలు : 12.37 లక్షలు
► అడ్వాన్సులు, రావల్సినవి: రూ.5.14 కోట్లు
► పీఎఫ్ ఎకౌంట్‌లో నిల్వ:19.64 లక్షలు
► నగదు, బ్యాంక్ బ్యాలెన్స్: 25.92 లక్షలు
► మొత్తం ఆస్తులు: రూ. 12.76 కోట్లు
► లోన్లు, అడ్వాన్సులు: 42.18 లక్షలు
► నికర ఆస్తులు: రూ.12.33 కోట్లు
 
 నారా దేవాన్ష్
 ► హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లోని ప్లాట్ నంబర్ 469లో 19,500 చదరపు అడుగుల నిర్మాణ  విస్తీర్ణం కలిగిన 1,191 చదరపు గజాల ప్లాట్: రూ.9.18 కోట్లు
► పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ విభాగంలో ఫిక్సడ్ డిపాజిట్లు: రూ. 2.04 కోట్లు
► అడ్వాన్సులు, రావాల్సినవి: రూ.5.63 లక్షలు
► వెండి ఊయల: రూ.2.87 లక్షలు
► బ్యాంకు ఎకౌంట్‌లో నిల్వ, నగదు: రూ.2.31 లక్షలు
► మొత్తం ఆస్తులు: రూ.11.33 కోట్లు
► గత ఆర్థిక సంవత్సరంలో నానమ్మ నారా  భువనేశ్వరి నుంచి రూ.9.20 కోట్లు, తాతయ్య నందమూరి బాలకృష్ణ నుంచి రూ.2.04 కోట్లు, తండ్రి నారా లోకేష్ నుంచి రూ.2.87 లక్షల విలువైన వెండి ఊయల బహుమతిగా అందుకున్నాడు.
 
 నిర్వాణ హోల్డింగ్స్
► లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు:  హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్‌లో 25,72,842 షేర్లు: రూ.10.83 కోట్లు
► అన్ లిస్టెడ్ కంపెనీల్లో షేర్ల విలువ: రూ.7.14 కోట్లు
► మోటారు కార్లు: మూడు ఫార్చునర్ కార్లు, రేంజ్ రోవర్, స్కార్పియో, ఒక బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్: రూ.3.81 కోట్లు
► అడ్వాన్సులు, రావల్సినవి: 10.90 లక్షలు
► బ్యాంకు ఎకౌంట్‌లో నిల్వ: 14.10 లక్షలు
► మొత్తం ఆస్తులు: రూ.22.02 కోట్లు
 
 రుణాలు, అప్పులు
► వాహనాల కొనుగోలుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రుణం: రూ.1.40 కోట్లు
► షేర్ క్యాపిటల్: నారా భువనేశ్వరి: రూ.3.29 కోట్లు, నారా లోకేష్: రూ.1.62 కోట్లు
► అడ్వాన్సులు: నారా భువనేశ్వరి: రూ.7.69 కోట్లు, నారా లోకేష్: రూ.2.64 కోట్లు
► ఇతర అడ్వాన్సులు: రూ.5.83 కోట్లు
► మొత్తం అప్పులు: రూ.22.46 కోట్లు
► నికర ఆస్తులు: -43.95 లక్షలు

మరిన్ని వార్తలు