సినారెను సముచితంగా గౌరవించుకుంటాం: కేసీఆర్‌

13 Jun, 2017 14:22 IST|Sakshiహైదరాబాద్‌:
విశ్వవిఖ్యాత కవిరేడు పద్మభూషణ్‌ డాక్టర్‌ సి.నారాయరణరెడ్డి పేరుమీద హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున స్మారక భవనం నిర్మిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ పరంగా, సమాజ పరంగా మహాకవిని సముచితంగా గౌరవించుకుంటామని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం సినారె భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.

‘సి. నారాయణరెడ్డిగారు పుట్టిన ఊరైన హనుమాజీపేట తోపాటు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌, సిరిసిల్ల, కరీంనగర్‌లలో ఆయన కాంస్య విగ్రహాలను ఏర్పాటుచేస్తాం. వారు ఎంతగానో ప్రేమించిన సార్వత కళా పరిషత్‌కు ఇదివరకే గ్రాంట్లు అందించాం. ఇక ముందు కూడా ఆ సంస్థకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రాష్ట్రంలోని ప్రముఖ సంస్థకు ఆయన పేరు పెడతాం. సినారెను ఇంకా గొప్పగా గౌరవించుకునేక్రమంలో ప్రభుత్వానికి ఉత్తమ సలహాలు ఇవ్వదలుచుకుంటే స్వీకరిస్తాం’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

సినారె భౌతికకాయాన్ని సందర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ వెంట డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు. అమెరికా నుంచి కుటుంబసభ్యులు రావాల్సి ఉంది. బుధవారం ఉదయం సినారె అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సినారె(85) సోమవారం తెల్లవారుజామున నిద్రలోనే తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.