జానారెడ్డీ.. గట్లనేనా మాట్లాడేది?

22 Dec, 2016 05:47 IST|Sakshi
జానారెడ్డీ.. గట్లనేనా మాట్లాడేది?

జానాపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫైర్‌
- రుణమాఫీ ఏమన్నా బ్రహ్మపదార్థమా.. ఇంకేం లేదా?
- పాడిందే పాడరా.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు
- ఇంకా కాంగ్రెస్‌ పాలనపై ఎందుకు విమర్శలు: జానారెడ్డి
- ఇప్పుడు మీరేం చేస్తున్నారో చెప్పండి
- కేంద్రం నిధులను మళ్లించడం పద్ధతేనా?
- అసెంబ్లీలో ఇరువురు మధ్య వాడివేడి చర్చ


సాక్షి, హైదరాబాద్‌:

‘‘ఏనుగు దూరి తోకచిక్కినట్టు.. రైతు రుణమాఫీలో 75 శాతాన్ని చెల్లించి మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు ఏర్పాటు చేస్తుంటే పాడిందే పాడరా... అన్నట్టు కాంగ్రెస్‌ సభ్యులు వ్యవహరిస్తున్నారు. ఇదేదో బ్రహ్మపదార్థం అయినట్టు ఇంతకు మించింది లేనేలేనట్టు సభలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్నో పర్యాయాలు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి గట్లనే మాట్లాడ్తరా..’’ – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

‘‘ఎంతసేపూ కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో అట్లా.. ఇట్లా.. అంటూ చెప్పిందే చెప్పి.. అన్నదే అని.. ఏంటిది? మా ప్రభుత్వం పోయి మీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మళ్లిస్తున్నారు. ఇదేనా పద్ధతి?’’ – సీఎల్‌పీ నేత జానారెడ్డి

వ్యవసాయంపై అసెంబ్లీలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, సీఎల్పీ నేత జానారెడ్డి మధ్య కాసేపు వాడివేడి సంభాషణ చోటు చేసుకుంది. చర్చ అనంతరం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధాన మిస్తూ.. తాను టీడీపీలో ఉండి అప్పటి ముఖ్యమంత్రి పనితీరు, టీఆర్‌ఎస్‌లో ఉంటూ ప్రస్తుత సీఎం పనితీరును దగ్గర్నుంచి చూశానని, ఇచ్చిన ఎన్నికల హామీలను 98% వరకు అమలు చేసి చూపు తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అంటూ కితాబిచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో రూ.480 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయి పడితే తాము అధికారంలోకి వచ్చాక చెల్లించినట్టు గుర్తు చేశారు. దీనికి కాంగ్రెస్‌ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. మంత్రి అన్నీ తప్పుడు లెక్కలు సభ ముందుం చుతున్నారని, సరైన వివరాలు చెప్పేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ సభ్యు లు జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్, రామ్మో హన్‌రెడ్డి తదితరులు పట్టు బట్టారు.

ఈ సమ యంలో జానారెడ్డి లేచి... దాదాపు రూ. 2,100 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించిన తర్వా త మిగిలిన రూ.480 కోట్లు చెల్లించే తరుణం లో రాష్ట్రపతి పాలన రావటంతో బకాయి పడిందని గుర్తు చేశారు. ‘కాంగ్రెస్‌ హయాం లో తెలంగాణకు వివక్ష..’ అంటూ చెప్పిన విషయాలనే చెబుతున్నారన్నారు. సోలార్‌ పంప్‌సెట్లపై కేంద్రం సబ్సిడీ ఇస్తే ఈ ప్రభు త్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఇంతలో సభలోకి వచ్చిన సీఎం జానా తీరును తీవ్రం గా తప్పుబట్టారు. ‘‘కారణాలేవైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం బకాయిపడ్డ రూ.480 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని తెలంగాణ వచ్చాక మేం విడుదల చేసినమాట నిజమా కాదా..? రైతు రుణమాఫీలో 75 శాతం చెల్లించి మిగతా 25 శాతం ఇప్పుడు చెల్లించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పాడిందే పాడరా... అన్నట్టు కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారు. ఎన్నో ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన సీనియర్‌ నేత జానారెడ్డి ఇలా మాట్లాడ్డం సరికాదు..’’ అని పేర్కొన్నారు.

ఈ విషయం జానాకు తెలియదా?
మన పక్క రాష్ట్రంలో రూ.11 వేల కోట్ల రుణమాఫీ చెల్లిస్తే.. తెలంగాణలో రూ.12 వేల కోట్లు చెల్లించామని, దేశంలో మరేదైనా రాష్ట్రంలో ఇంతమొత్తం చెల్లించారా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. కేంద్రాన్ని రూ.3 వేల కోట్లు అడిగితే రూ.1,100 కోట్లు వచ్చాయని, ఇందులో ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.703 కోట్లు ఉందన్నారు. ఆ సమయంలో తీవ్ర నీటి సమస్య ఉంటే ఆ నిధులను వాటికోసం సర్దుబాటు చేశామన్నారు. ఇలా సర్దుబాటు చేసే వెసులుబాటు ఉంటుందని జానారెడ్డికి తెలియక మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.

అలా సర్దుబాటు చేసిన మొత్తాన్ని ఇప్పుడు చెల్లించామని, దీన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావటం లేదని సీఎం పేర్కొన్నారు. అనంతరం పోచారం ప్రసంగాన్ని కొనసాగించారు. కాంగ్రెస్‌ హయాంలో రైతులకు పగటివేళ రెండు గంటలు కూడా కరెంటు లేకపోతే తాను, హరీశ్‌రావు నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలసి సమస్య విన్నవిస్తే.. ‘‘తెలంగాణ తెచ్చుకుంటామంటున్నారు కదా తెచ్చుకోండి.. అప్పుడు ఈ మాత్రం కూడా ఉండదు..’’ అని పేర్కొన్నారని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు