ప్రాసకు నడక నేర్పిన సాహితీ శిఖరం

14 Jun, 2017 01:32 IST|Sakshi
ప్రాసకు నడక నేర్పిన సాహితీ శిఖరం

► సినారెకు సీఎం కేసీఆర్‌ ఘన నివాళి
►నేడు అంత్యక్రియలు సినారెకు సీఎం కేసీఆర్‌ ఘన నివాళి
►తెలంగాణ తలెత్తుకుని గర్వపడే మహనీయుడు
►సినారెకు నాలాంటి అభిమానులు కోట్లాది మంది
►సినారె పేరిట స్మారక మ్యూజియం, సమావేశ మందిరం..
►ట్యాంక్‌బండ్‌పై కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం
►నేడు ఉదయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో సినారె అంత్యక్రియలు
►జిల్లాల నుంచి తరలివచ్చే వారి కోసం ఉచిత బస్సులు
►అంతిమయాత్రలో పాల్గొననున్న సీఎం, పలువురు ప్రముఖులు
 

సాక్షి, హైదరాబాద్‌
‘‘కవులు, రచయితలు చాలా మంది ఉంటరు.. కానీ సినారె సభ అంటే, సినారె మాట అంటే ఓ గ్లామర్‌. కవులకు గ్లామర్‌ ఉంటుందని నిరూపించిన వ్యక్తి సినారె. ఆయన ఉపన్యాసం వినాలనే ఉత్సాహంతో వందలాదిగా సభలో పాల్గొనేవారు. పుట్టింది తెలంగాణ గడ్డ అయినప్పటికీ, మొత్తం తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకోనేటువంటి వ్యక్తి ఆయన. ఆది ప్రాసలకు, అంత్య ప్రాసలకు అద్భుతమైన నడక నేర్పడంలో సినారెకు ఎవరూ పోటీ లేరు..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

మంగళవా రం హైదరాబాద్‌ లోని సినారె నివాసానికి వెళ్లిన కేసీఆర్‌.. సినారె పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి.. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబా నికి అండగా ఉంటా మని హామీ ఇచ్చారు. అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. భావితరాలు సినారెను గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

ఎంత కీర్తించుకున్నా తక్కువే..
తెలంగాణ గర్వంగా తలెత్తుకుని చెప్పుకొనే టంతటి మహనీయుడు సినారె అని, తెలంగా ణ సాహితీ మకుటంలో ఆయనొక కలికితురా యి అని కేసీఆర్‌ కీర్తించారు. ఆయనను ఎంత కీర్తించుకున్నా, పొగుడుకున్నా, ఎంత స్మరిం చుకున్నా తక్కువేనని.. సాహిత్య రంగానికి సినారె అందించిన విశేష సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. ఈ మధ్యే తాను వరంగల్‌ వెళ్లినప్పుడు సినారె రాసిన మందార మకరం దాలు పుస్తకంలోని పద్యాలను బమ్మెర పోతన సమాధి వద్ద కోట్‌ చేశానని కేసీఆర్‌ చెప్పారు. అది సినారె విన్నారని వారి కుటుంబ సభ్యులు చెప్పారని.. తనలాంటి అభిమానులు కోటానుకోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు.

నేడు మహాభినిష్క్రమణం
తెలుగు సాహితీ జగత్తు రారాజు సినారె అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్థానంలో  జరుగనున్నా యి. అధికార లాంఛనాలతో ఈ అంత్యక్రియ లు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ట్లు  చేసింది. తొలుత ఉదయం 9 గంటల నుంచి గంటపాటు సినారె పార్థివదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌ భవనంలో ఉంచుతారు. పది గంటలకు సారస్వత పరిషత్‌ నుంచి ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్థానానికి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు ఈ అంతిమయాత్రలో పాల్గొననున్నారు.

నివాళి అర్పించిన ప్రముఖులు
సినారె పార్థివదేహం వద్ద మంగళవారం పెద్ద సంఖ్యలో పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు, అభిమానులు నివాళు లు అర్పించారు. మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, తలసాని, నాయిని, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, మర్రి జనార్దన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ప్రముఖ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, గాయని జానకి తదితరులు సినారె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

సినారె స్మారక మ్యూజియం
సినారెకు ప్రభుత్వం తరఫున ఘనమైన నివాళులు అర్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ చెప్పారు. ఆయన పేరిట స్మారక మ్యూజియంతోపాటు సాహితీ సమాలోచనలు జరుపుకొనేలా సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకు హైదరాబాద్‌ నడిబొడ్డున స్థలం కేటాయిస్తామన్నారు. ఓ ప్రముఖ సంస్థకు సినారె పేరు పెడతామని.. ట్యాంక్‌ బండ్‌తో పాటు కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో, సినారె స్వగ్రామం హన్మాజీపేటలో ప్రభుత్వపరంగా సినారె కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సినారె చాలా ప్రేమించిన సారస్వత పరిషత్తుకు ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తామన్నారు.

ప్రత్యేక బస్సులు
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ మహా ప్రస్థానంలో బుధవారం జరిగే అంత్య క్రియలకు అన్ని జిల్లాల నుంచి సినారె అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరఫున ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, సాంçస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణలకు అప్పగిం చారు. అంత్యక్రియల్లో తాను స్వయంగా పాల్గొంటానని, తెలంగాణ ప్రజల తరఫు న సినారెకు గొప్ప వీడ్కోలు పలకాలని సీఎం పిలుపునిచ్చారు. అంత్యక్రియలకు హాజరయ్యే వారికోసం బుధవారం రాష్ట్రంలోని 31 జిల్లా కేంద్రాల నుండి 2 చొప్పున ఉచిత బస్సులు నడుపుతున్నట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. వాటిలో హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్థానానికి వచ్చి, తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా