విస్తరణ వేళ: అరుణ్‌ జైట్లీతో కేసీఆర్‌ భేటీ

2 Sep, 2017 15:24 IST|Sakshi
విస్తరణ వేళ: అరుణ్‌ జైట్లీతో కేసీఆర్‌ భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. కేంద్ర కేబినెట్‌ విస్తరణ కోసం హస్తినలో చురుగ్గా అడుగులు పడుతున్న వేళ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఢిల్లీలో జైట్లీని కలువడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా కేంద్ర కేబినెట్‌లో చేరే  అవకాశముందని ఊహాగానాలు సాగుతున్న సంగతి తెలిసిందే.

అయితే, సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు, కేంద్ర కేబినెట్‌ విస్తరణకు ఎలాంటి సంబంధం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం రక్షణశాఖ భూములు అప్పగించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ జైట్లీని కలిశారని, ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు, కేంద్ర కేబినెట్‌ విస్తరణ అంశాలు చర్చించలేదని సీఎంవో వర్గాలు స్పష్టం చేశాయి. ప్యాట్నీ-శామీర్‌పేట్‌, ప్యారడైజ్‌-బోయిన్‌పల్లి ఫ్లైఓవర్‌ కోసం రక్షణశాఖ భూములు ఇవ్వాలని,  సికింద్రాబాద్‌లో నూతన సచివాలయ నిర్మాణానికి భూసేకరణలో సహకరించాలని సీఎం కేసీఆర్‌ జైట్లీతో భేటీ అయ్యారని ఆ వర్గాలు చెప్పాయి. మూడు రోజుల పర్యటన కోసం సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి దేశ రాజధానికి చేరుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు