‘అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయి’

24 Sep, 2016 18:33 IST|Sakshi
‘అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయి’

హైదరాబాద్‌: ఇటీవల కురిసిన వర్షాలకు  నిండుగా నీళ్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. నింజాసాగర్‌, ఎస్సారెస్పీ, అప్పర్ మానేరు, లోయర్‌ మానేరు, సింగూరు ఇలా అన్నీ ప్రాజెక్టులు నీళ్లతో నిండుగా మారాయని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఓవర్‌ఫ్లో అయ్యే పరిస్థితి నెలకొందని, శ్రీశైలం గేట్లు ఎత్తితే.. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కూడా నిండుతుందని తెలిపారు. ఇటీవలి కురిసిన వర్షాలతో మిషన్‌ కాకతీయ పథకం మంచి ఫలితాలను ఇవ్వనుందని, రెండేళ్ల వరకు కరువు రక్కసి తెలంగాణ వైపు చూడబోదని, సాగునీటికి, తాగునీటికి ఎలాంటి కష్టం ఉండబోదని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని వర్షాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్‌ శనివారం విలేకరులతో మాట్లాడారు. భారీ వర్షాల వల్ల కరెంటుకు పెద్దగా అంతరాయం కలుగలేదని, ప్రాణనష్టం కూడా పెద్దగా జరగలేదని కేసీఆర్‌ అన్నారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సమీక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అంటువ్యాధుల ప్రబలకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. అన్ని జిల్లాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని, అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయని, ప్రభుత్వ అధికారులకు సెలవు రద్దు చేసినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు