గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా

15 Aug, 2015 01:12 IST|Sakshi
గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా

♦  ‘గ్రామజ్యోతి’ మార్గదర్శకాలు విడుదల చేసిన సర్కారు
♦  గ్రామాభివృద్ధికి ఏడు కమిటీలు
♦  పంచాయతీ స్థాయిలోనే ప్రణాళికలు
♦  గ్రామ సభ ఆమోదంతో అమలు
♦  అన్ని సంఘాలు, సంస్థల భాగస్వామ్యం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గ్రామజ్యోతి’ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామాభివృద్ధి ప్రణాళికలను పంచాయతీ స్థాయిలోనే రూపొందించడం, గ్రామాల సంపూర్ణ అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములుగా చేయడమే ‘గ్రామజ్యోతి’ ప్రధాన ఆశయంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంచాయతీలు సాధికారత సాధించాలంటే ఏడు కీలక రంగాలకు సంబంధించిన అభివృద్ధి జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. తాగునీరు-పారిశుద్ధ్యం, ఆరోగ్యం-పోషకాహారం, విద్య, మౌలిక సదుపాయాలు, సహజ వనరుల నిర్వహణ, సామాజిక భద్రత-పేదరికాన్ని తగ్గించడం, వ్యవసాయం వంటివి ఇందులో ఉన్నాయి.

ఆయా రంగాల్లో సమగ్రమైన అభివృద్ధి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను గ్రామస్థాయిలోనే రూపొందించాల్సి ఉంది. ప్రణాళికల రూపకల్పనలో గ్రామాల్లో ఉండే స్వయం సహాయక గ్రూపులు, శ్రమశక్తి సంఘాలు, యువజన బృందాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రిటైర్డు ఉద్యోగులు, వివిధ రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.
 
ప్రతి రంగానికి ఒక కమిటీ
ప్రతి గ్రామంలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, అమలు నిమిత్తం ప్రతి రంగానికి తప్పనిసరిగా ఒక కార్యనిర్వాహక కమిటీ ని ఏర్పాటు చేయాలని సర్కారు సూచించింది. మండల/గ్రామ పంచాయతీ స్థాయిలో పనిచేసే అధికారి కన్వీనర్‌గా ఉండే ఈ క మిటీలో ఒకరు లేదా కొందరు వార్డు సభ్యులు, ఎస్‌హెచ్‌జీ గ్రూపు లీడరు, కుల సంఘం లేదా గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసే ఎన్జీవో ప్రతినిధి సభ్యులుగా ఉంటారు.

గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం సకాలంలో పూర్తయ్యేలా కమిటీలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రణాళికల రూపకల్పన నిమిత్తం ఆ రంగానికి సంబంధించి వనరుల సమాచారం సేకరించాలి, అవసరాలను అంచనా వేయాలి, ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాలి. నిర్ణయం తీసుకోవడంలో అందర్నీ భాగస్వాములను చేసే పద్ధతులను పాటించాలి. ప్రణాళికను రూపొందించి గ్రామసభ ఆమోదం పొందాలి.
 
కార్యక్రమాలు-ఫలితాలు :-

పారిశుద్ధ్యం-తాగునీరు కమిటీ
ఈ కమిటీకి గ్రామ సర్పంచ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ సర్వే ద్వారా గ్రామంలో మరుగుదొడ్డి లేని ఇళ్లను గుర్తించాలి. ప్రజల భాగస్వామ్యంతో మురుగునీరు, చెత్తకోసం డంప్‌యార్డులను గుర్తించాలి. చెత్తాచెదారాన్ని తొలగించాలి. దోమల వ్యాప్తిని నివారించేందుకు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. మలే రియా, డెంగీ, చికెన్ గున్యా, డయేరియా, కలరా, కామెర్లు వంటివి విజృంభించకుండా చర్యలు చేపట్టాలి. తాగునీటి వనరులను క్లోరినేషన్  చేయించాలి. నల్లాద్వారా ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేయాలి. పైపులైన్ల లీకేజీని అరికట్టాలి.
 
ఆరోగ్యం-పోషకాహారం
ఈ కమిటీకి పంచాయతీలోని వార్డు సభ్యురాలిని చైర్మన్‌గా నియమించాలి. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను సమన్వయపరచి వారు చేస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించాలి. తల్లులు, శిశువులు, వృద్ధుల ఆరోగ్య సమస్యలను ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు తప్పనిసరిగా కమిటీకి, గ్రామసభకు రిపోర్టు చేయాలి. ప్రధానంగా గర్భిణులు, శిశు ఆరోగ్యం, జనరల్ హెల్త్ అంశాలపై కమిటీ దృష్టి సారించాలి. వంద శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లో జరిగేలా, శిశువులకు సంపూర్ణంగా వ్యాధి నిరోధకాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించడం ద్వారా మాతా శిశువులకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించాలి.
 
వ్యవసాయం
గ్రామ ఉప సర్పంచ్‌ను ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించాలి. సబ్సిడీ విత్తనాల పంపిణీ, భూసార ఆరోగ్య కార్డుల నిర్వహణ, సాగు యాంత్రీకరణ, వడ్డీలేనిరుణాలు, పావలా వడ్డీ రుణాలు, చేనేతలకు రుణాలు అందేలా చూడాలి. పెట్టుబడులు, రుణాలను పర్యవేక్షించి రైతులపై ఒత్తిడి తగ్గించాలి.
 
సామాజిక భద్రత
ఎస్సీ/ఎస్టీ మహిళను ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించాలి. గ్రామంలోని  నిరుపేదల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి. సంక్షేమ పథకాలు వినియోగించుకునేలా ప్రణాళికలు ఉండాలి. నిరుపేదలను ఎంపిక చేయడం ద్వారా ప్రభుత్వం ఇచ్చే లబ్ధిని అర్హులకు అందించాలి.
 
సహజ వనరుల నిర్వహణ
ఈ కమిటీకి సర్పంచ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రక్షిత వాతావరణం ఉండేలా గ్రామంలోని సహజ వనరులను పరిరక్షించాలి. ఉపాధి హామీ పథకంతో వాటర్‌షెడ్‌లు ఏర్పాటు చేయాలి. ‘హరిత హారం’ ద్వారా గ్రామంలో ఏటా 40వేల మొక్కలు నాటాలి. ఉపాధి హామీ ద్వారా గ్రామానికి శాశ్వత ఆస్తులను సృష్టించాలి.
 
విద్యాకమిటీ
గ్రామంలో 100 శాతం అక్షరాస్యత ఈ కమిటీ లక్ష్యం. ఆరు నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులందరినీ పాఠశాలకు పంపాలి. మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులను ప్రీప్రైమరీలో చేర్చాలి. విద్యలో నాణ్యతను, మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాలి. డ్రాపౌట్లను నియంత్రించాలి. వయోజన విద్యను మెరుగుపర్చాలి.
 
మౌలిక సదుపాయాలు
ఈ కమిటీకి సర్పంచ్ చైర్మన్‌గా ఉంటారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కోసం పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను సమన్వయ పరచాలి. రోడ్లు, వీధి దీపాల నిర్వహణ ద్వారా మెరుగైన సేవలందించాలి. వంద శాతం ఇంటిపన్ను వసూలు ద్వారా పంచాయతీ సిబ్బందికి వేతనాలివ్వాలి. ఎస్సీ కాలనీలు, గిరిజన తండాల్లో వసతుల కల్పనకు సబ్‌ప్లాన్ నిధులు వినియోగించుకోవచ్చు.
 
కార్యదర్శి నుంచి కలెక్టర్ దాకా..
పంచాయతీ కార్యదర్శి నుంచి కలెక్టర్ దాకా పాలనాధికారులు గ్రామజ్యోతిలో భాగస్వాములవ్వాలి. గ్రామాభివృద్ధి ప్రణాళికల కసరత్తుకు అధికారుల సూచనల మేర కు పంచాయతీ కార్యదర్శి ఏర్పాట్లు చేయా లి. మనఊరు-మన ప్రణాళిక తరహాలోనే గ్రామానికి ప్రత్యేకాధికారిని నియమిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవో కన్వీనర్ ఉంటారు. డివిజన్ పరిధిలో డివిజినల్ పంచాయతీ అధికారి సమన్వయం చేసా రు. జిల్లాకు నోడల్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) ఉంటారు.

మరిన్ని వార్తలు