సీఎన్‌జీపై రూ.15 తగ్గింపు

4 Feb, 2014 00:32 IST|Sakshi

న్యూఢిల్లీ: కంప్రెష్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్‌జీ), పైపుల్లో సరఫరా అయ్యే వంటగ్యాస్(పీఎన్‌జీ) ధరలు తగ్గనున్నాయి. ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, సూరత్  తదితర నగరాలకు గ్యాస్ కోటా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సీఎన్‌జీ ధర కేజీకి ఏకంగా రూ.15, పీఎన్‌జీ ధర రూ. 5 తగ్గనున్నాయి.  ఢిల్లీలో రూ.50గా సీఎన్‌జీ ధర రూ.15(30 శాతం), పీఎన్‌జీ ధర ఘనపు మీటరుకు రూ.5(20 శాతం) తగ్గుతాయని పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ సోమవారమిక్కడ చెప్పారు. సీఎన్‌జీ, పీఎన్‌జీ డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లపై భారం పడకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

 

ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తెస్తామని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ బీసీ త్రిపాఠీ తెలిపారు. సీఎన్‌జీ ధర ఢిల్లీలో గత నెల రూ.4.50 పెరిగి రూ.50.10కి చేరడంతో రిటైలర్లు మూడు రెట్ల అధిక ధరతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలిపింది. ఆటో డ్రైవర్లు సమ్మెకు దిగుతామని సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పై నిర్ణయం తీసుకుంది. దేశీయ గ్యాస్ క్షేత్రాల నుంచి నగరాల్లోకి గ్యాస్ సంస్థలకు కేటాయింపులను 80 శాతం నుంచి వంద శాతానికి పెంచామని మొయిలీ తెలిపారు.
 

మరిన్ని వార్తలు