బొగ్గు ఉత్పత్తిలో నంబర్ వన్

19 Jan, 2016 02:38 IST|Sakshi
బొగ్గు ఉత్పత్తిలో నంబర్ వన్

సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి బొగ్గు గనుల సంస్థ అత్యుత్తమ ఫలితాలు సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలవడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, ఇతర ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో డివిడెండ్‌గా రూ.66.42 కోట్ల చెక్కును సింగరేణి సీఎండీ శ్రీధర్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సింగరేణి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ మొత్తం రూ.409 కోట్ల లాభాలు గడించింది.

రాష్ట్రానికి 7.5 శాతాన్ని డివిడెండ్‌గా నిర్ణయించింది. దీని ప్రకారం 51 శాతం వాటా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రూ.66.42 కోట్లు, 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రూ.63.58 కోట్లు లభిస్తాయి.  2014-15 సంవత్సరంలో 520 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణి, 2015-16లో 600 లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది.

దేశ వ్యాప్తంగా ఉన్న ఎనిమిది కోల్ ఇండియా సంస్థల్లో కెల్లా సింగరేణి అత్యధిక ఉత్పత్తి సాధిస్తున్న సంస్థగా నిలిచింది. తెలంగాణలోనే మరో 50 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని, అయినా ఇతర చోట్ల కూడా గనులను నిర్వహించాలని సంస్థ అధికారులను సీఎం కోరారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, సింగరేణి డెరైక్టర్ రమేశ్ బాబు, జీఎం నాగయ్య పాల్గొన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు