సీల్డ్ కవర్‌లో వాంగ్మూలాలు

28 Jan, 2015 03:01 IST|Sakshi
సీల్డ్ కవర్‌లో వాంగ్మూలాలు

బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తు పురోగతి
 నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించిన సీబీఐ
 సీల్డ్ కవర్ తెరిచి పరిశీలించిన న్యాయమూర్తి
 రెండు వారాల్లో దర్యాప్తు పూర్తిచేస్తామన్న సీబీఐ

 
 న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కుంభకోణం కేసులో కొనసాగుతున్న దర్యాప్తులో ప్రగతిపై నివేదికను, ఈ కేసుకు సంబంధించి తాజాగా సీబీఐ అధికారులు ప్రశ్నించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, నాటి పీఎంఓ ఉన్నతాధికారుల వాంగ్మూలాలను.. కేంద్ర దర్యాప్తు సంస్థ మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు సీల్డ్‌కవర్‌లో సమర్పించింది. ఈ కేసులో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కూడా ప్రశ్నించాల్సిందిగా సీబీఐని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బొగ్గు మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్, పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా తదితరులు నిందితులుగా ఉన్న ఈ బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తును పూర్తిచేసేందుకు మరో రెండు వారాల గడువును సీబీఐ కోరింది.
 
 విచారణ సందర్భంగా సీల్డ్ కవర్‌ను తెరచి.. సీబీఐ సమర్పించిన వాంగ్మూలాలు, ఇతర పత్రాలను ప్రత్యేక న్యాయమూర్తి భరత్‌పరాశర్ పరిశీలించారు. అయితే.. ఈ వాంగ్మూలాలు, పత్రాలను తదుపరి దర్యాప్తు పూర్తయ్యేవరకూ సీల్డ్ కవర్‌లోనే ఉంచాలని, వాటిని పరిశీలించేందుకు అనుమతించరాదని సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.కె.శర్మ కోర్టుకు విజ్ఞప్తిచేశారు. ఈ నేపధ్యంలో ఆయా పత్రాలన్నిటినీ మళ్లీ సీల్డ్ కవర్‌లో ఉంచి, కోర్టు సీల్‌తో సీల్ చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. దర్యాప్తును రెండు వారాల్లో పూర్తిచేస్తామని సీబీఐ పేర్కొనడంతో.. కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు.
 
  బొగ్గు స్కాం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, అప్పటి ప్రధానమంత్రి కార్యాలయంలోని ఉన్నతస్థాయి అధికారులైన మన్మోహన్ ముఖ్య కార్యదర్శి టి.కె.ఎ.నాయర్, వ్యక్తిగత కార్యదర్శి బి.వి.ఆర్.సుబ్రమణ్యం తదితరులను కూడా ప్రశ్నించాల్సిందిగా ప్రత్యేక కోర్టు గత డిసెంబర్ 16వ తేదీన ఆదేశించటంతో.. సీబీఐ ఆ మేరకు వారిని ప్రశ్నించి తాజాగా పురోగతి నివేదికను, వాంగ్మూలాల పత్రాలను కోర్టుకు సమర్పించింది. ఒడిశాలోని తాలాబిరా-2 బొగ్గు క్షేత్రాన్ని 2005 సంవత్సరంలో హిందాల్కో సంస్థకు కేటాయించటంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.
 
 హిందాల్కోకు అనుకూలంగా వ్యవహరించలేదన్న మన్మోహన్!
 తాలాబిరా-2 కేటాయింపులో హిందాల్కోకు ఏ విధంగానూ అనుకూలంగా వ్యవహరించలేదని.. నిర్దిష్ట విధివిధానాల ప్రకారమే కేటాయింపు జరిగిందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సీబీఐకి స్పష్టంచేసినట్లు తెలిసింది. ఈ కేసులో కోర్టు ఉత్తర్వుల మేరకు 10 రోజుల కిందట తనను ప్రశ్నించిన సీబీఐ అధికారులకు ఆయన పై విధంగా వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తాలాబిరా-2 బొగ్గు క్షేత్రం కేటాయింపు జరిగినపుడు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నాటి ప్రధాని మన్మోహన్ పర్యవేక్షణలోనే ఉన్న విషయం తెలిసిందే. హిందాల్కో సంస్థకు తాలాబిరా-2 బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా 2005 మే 7, జూన్ 17 తేదీల్లో ప్రధానికి రెండు లేఖలు రాసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి.. సీబీఐ అధికారులు కొద్ది రోజుల కిందట మన్మోహన్‌ను ప్రశ్నించినట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి.
 

మరిన్ని వార్తలు