ముక్కులో బొద్దింక.. 12 గంటల పోరాటం

3 Feb, 2017 15:06 IST|Sakshi
ముక్కులో బొద్దింక.. 12 గంటల పోరాటం
ముక్కులో ఏదైనా చిన్న కాగితం లాంటిది తగిలితేనే భలే చిరాగ్గా ఉంటుంది. దాన్ని తీసేసేవరకు అస్సలు ఊరుకోలేం. అలాంటిది చెన్నైలో ఓ మహిళ ముక్కులో బతికున్న పెద్ద బొద్దింక ఏకంగా 12 గంటల పాటు ఉండిపోయింది. అది కూడా ముక్కు రంధ్రం గుండా... ఏకంగా కళ్ల మధ్య వరకు వెళ్లిపోయింది. మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తర్వాత చివరకు మరో పెద్దాస్పత్రిలో వైద్యులు జాగ్రత్తగా ఆ బొద్దింకను బయటకు తీసి ఆమెను కాపాడారు. అలా తీసేవరకు కూడా ఆ బొద్దింక సైతం బతికే ఉండటం గమనార్హం.

చెన్నైలోని ఇంజంబాకం ప్రాంతానికి చెందిన సెల్వి (42) మంగళవారం రాత్రి నిద్రపోయినప్పుడు అర్ధరాత్రి ఉన్నట్టుండి ముక్కులో ఏదో దురద పుట్టినట్లనిపించి నిద్రలేచారు. జలుబు వల్ల అలా అయి ఉంటుందనుకున్నానని, కానీ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉండటంతో ఏదో ఉందని భావించానని చెప్పారు. ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ ముక్కు లోపల ఏదో పెరిగి ఉంటుందనుకున్నారు. రెండో ఆస్పత్రికి వెళ్లగా నీళ్లను లోపలకు పంప్ చేసి దాన్ని బయటకు తీద్దామనుకున్నారు గానీ కుదరలేదు. మూడో ఆస్పత్రికి వెళ్లగా, ఏదో కదులుతున్న వస్తువు ఉందని చెప్పి, స్కాన్ చేయాలన్నారు. 
 
బుధవారం తెల్లవారేసరికి ఆమెకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టం కావడంతో స్టాన్లీ మెడికల్ కాలేజి ఆస్పత్రిలోని ఈఎన్‌టీ విభాగానికి ఆమెను తరలించారు. అక్కడి వైద్యులు ముక్కుకు ఎండోస్కొపీ చేసి చూడగా.. రెండు యాంటెన్నాల లాంటివి కనిపించాయి. అది పెద్ద బొద్దింకేనని ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ ఎంఎన్ శంకర్ చెప్పారు. ఎట్టకేలలకు వాళ్లు ఒక సక్షన్, ఫోర్‌సెప్స్ ఉపయోగించి ఆ బొద్దింకను బయటకు లాగారు. అలా దాన్ని బయటకు తీసేందుకు 45 నిమిషాల సమయం పట్టింది. 
 
ఇంతకుముందు కూడా తమ ఆస్పత్రికి ముక్కులో పూసలు, బటన్లు, చాక్ పీసు ముక్కల లాంటివి ఇరుక్కుని వచ్చినవాళ్లు ఉన్నారని, కానీ ఇంత పెద్దది, అందులోనూ బతికున్న బొద్దింకతో పేషెంట్లు రావడం ఇదే మొదటిసారని అక్కడి వైద్యులు చెప్పారు.
మరిన్ని వార్తలు