6000 మందిని తీసేస్తున్న కాగ్నిజెంట్

20 Mar, 2017 08:38 IST|Sakshi
6000 మందిని తీసేస్తున్న కాగ్నిజెంట్
బెంగళూరు: ఆటోమేషన్ ప్రభావం ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు భారీగా షాకిస్తోంది. ఐటీ కంపెనీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. తాజాగా అమెరికా టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ 6000 మందికి గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తం వర్క్ ఫోర్స్ లో 2.3శాతం మందిని కంపెనీ తీసేస్తోంది. కొత్త డిజిటల్ సర్వీసులోకి మరలే క్రమంలో ఐటీ ఇండస్ట్రి ఎదుర్కొంటున్న సంక్షోభంతో కంపెనీలు ఉద్యోగులకు గుడ్ బై చెబుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే కాగ్నిజెంట్ కూడా ఈ ఏడాది రెగ్యులర్ అప్రైజల్ సైకిల్ లో భాగంగా 6000 మందిని తొలగిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కాగ్నిజెంట్  ఉద్యోగులకు ఇది చాలా క్లిష్టమైన సమయమని, ఉద్యోగులు తమకు తాముగా రీస్కిల్ చేసుకోలేని పక్షంలో కంపెనీలో కొనసాగడం కష్టతరమని పేర్కొన్నాయి.
 
కాగ్నిజెంట్ కు గ్లోబల్ గా 2,65,000 మంది ఉద్యోగులుండగా... వారిలో 1,88,000 మంది భారత్ లో ఉన్నారు. గతేడాది కూడా కాగ్నిజెంట్ తమ వర్క్ ఫోర్స్ లో 1-2 శాతం తగ్గించుకుంది. అయితే ప్రస్తుతం ఎంతమందిని తీసేస్తున్నట్టో కంపెనీ స్పష్టంచేయనప్పటికీ, సంబంధిత వర్గాల ప్రకారం 6000 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్ లు ఖాయమంటూ వెల్లడవుతోంది.  తమ వర్క్ ఫోర్స్ మేనేజ్ మెంట్ స్ట్రాటజీలో  ఎప్పటికప్పుడూ   ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు జరుగుతూ ఉంటాయని, క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, వ్యాపార లక్ష్యాలను సాధించాల్సి ఉంటుందని కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా కంపెనీ ఏ చర్య తీసుకున్నా... అది పనితీరు ప్రకారమే ఉంటుందని చెప్పారు.    
 
మరిన్ని వార్తలు