కాగ్నిజంట్ నికర లాభం 15 శాతం వృద్ధి

6 Nov, 2013 00:58 IST|Sakshi
కాగ్నిజంట్ నికర లాభం 15 శాతం వృద్ధి

ముంబై: సాఫ్ట్‌వేర్ అవుట్‌సోర్సింగ్ సంస్థ కాగ్నిజంట్ టెక్నాలజీ నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి 15 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో 27.69 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం, ఈ ఏడాది ఇదే క్వార్టర్‌కు 31.96 కోట్ల డాలర్లకు పెరిగిందని కంపెనీ మంగళవారం తెలిపింది. ఆదాయం 22 శాతం వృద్ధితో 231 కోట్ల డాలర్లకు పెరిగిందని పేర్కొంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన 7 శాతం వృద్ధి సాధించామని వివరించింది. అవుట్ సోర్సింగ్ సర్వీసులకు డిమాండ్ పెరగడం, కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసులపై కంపెనీలు వ్యయాలను పెంచడం వంటి కారణాల వల్ల తమ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయని కాగ్నిజంట్ ప్రెసిడెంట్ గోర్డన్ కోబర్న్ చెప్పారు.
 
 అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో  75 శాతం మంది భారత్‌లోనే పనిచేస్తున్నారు. ఆర్థిక ఫలితాలు బావుండటంతో ఈ ఏడాది  గెడైన్స్‌ను కంపెనీ పెంచింది. 2012 ఆదాయంతో పోల్చితే 2013 ఆదాయం కనీసం 20 శాతం వృద్ధితో 884 కోట్ల డాలర్లకు పెరగవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తలు