'అసోం రేప్ ఫెస్టివల్' తప్పుడు కథనంతో అమెరికా మీడియా కండకావరం

23 Nov, 2013 13:09 IST|Sakshi
'అసోం రేప్ ఫెస్టివల్' తప్పుడు కథనంతో అమెరికా మీడియా కండకావరం

అసోంలో ‘రేప్ ఫెస్టివల్’ జరుగుతోందంటూ అమెరికాకు చెందిన నేషనల్ రిపోర్ట్ అనే వెబ్ సైట్ వివాదాస్పద కథనం ప్రచురించడం వెనక, పెచ్చరిల్లుతున్న  మానభంగ నేరాల పట్ల ఆందోళన ప్రకటించడం, వాటిని నియంత్రించడంలో ఇండియా చిత్తశుద్ధి లేమిని ఎత్తిచూపడమే తమ ఉద్దేశమని సదరు వెబ్ సైట్ నిర్వాహకులు వివరణ ఇస్తున్నారు. అయితే, ఈ వివరణలో నిజమెంత? భారత దేశం మీద వారు చూపుతున్న అక్కరలో నిజాయితీ ఎంత? అన్నది చాలా ముఖ్యం.

ఆ చర్చలోకి వెళ్లే ముందు, ఈ వార్తాకథనం పూర్వాపరాల్ని చూద్దాం. గంగలో పవిత్ర స్నానానికి ఉద్వేగ భక్తితో మూకుమ్మడిగా వెళ్తున్న నాగా సాధువుల ఫొటోతో పాటు, అసోంలో ‘రేప్ ఫెస్టివల్’ జరుగుతోందంటూ నేషనల్ రిపోర్ట్ పోస్ట్ చేసింది. సంక్షిప్తంగా, ఆ కథనం ప్రకారం, వేల సంవత్సరాలుగా గొప్ప ఆనవాయితీగా ఈ ‘రేప్ ఫెస్టివల్’అసోంలో ఏటేటా జరుగుతుంది. మగాళ్లు తోడేళ్లలా వెంట పడుతుంటే 7 నుంచి 16 ఏళ్ల ఆడపిల్లలు సురక్షిత స్థలాలకి పరుగులు తీయాలి, లేదా సామూహిక అత్యాచారానికి గురవ్వాలి. దీనికోసం మగవాళ్లు ఏడాది పొడుగునా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. విజేతగా నిలవడానికి ‘నేను క్రమం తప్పకుండా రోజూ రేప్ ప్రాక్టిస్ చేస్తాను. మా చెల్లిని, దాని స్నేహితురాళ్లనీ రేప్ చేస్తూనే ఉంటాను’ అని ఓ యువకుడు చెప్పినట్లు కూడా అందులో పేర్కొన్నారు.

ఒక పన్నెండేళ్ల అమ్మాయి వివరించిన తన అనుభవం ఇది: ‘గతేడాది, నేను  రేప్ తప్పించుకునే సురక్షిత వలయంలోకి దాదాపు కాలు పెట్టేశాను. కానీ, చివరి క్షణంలో 9 మంది మగాళ్లు నా మీదకి లంఘించి రేప్ చేశారు. నేను ఈ సంవత్సరం ఫెస్టివల్‌కి సిద్ధమయ్యేలా కోలుకున్నాను. నేను పాల్గోలేకపోతే, నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు’. కెనడా నుంచి వచ్చిన మెత్తని మనసున్న ఓ తెల్లతోలు మారాజు- ‘ఇటువంటి అనాగరికమైన, వెనకబడిన దేశం నుంచి ఈ రోజే వెళ్లిపోతాన’ని చెప్పడంతో ఆ వ్యంగ్య కథనం ముగుస్తుంది.

ఇప్పుడు తిరిగి, ఈ వెటకారపు వార్తని ప్రచురించడంలో నేషనల్ రిపోర్ట్ వెబ్ సైట్ ఉద్దేశం విషయానికి వద్దాం. ఆ వెబ్ సైట్ చెప్పుకుంటున్నట్టు దాని వెనక ఆక్రోశమే ఉందా, లేక పడమటి దొరల అక్కసు, అహంకారాలు ఉన్నాయా? ఓ ఇల్లు (లేదా ఒక సమాజం/ సమాజం) పరిశుభ్రంగా లేదని చెప్పడంలో రెండు విధానాలు- ఒకటి: ఆ ఇల్లు తనది అనుకొని, అశుభ్రంగా ఉండటం వల్ల బాధ పడి, లోపాన్ని సరిచేసే బాధ్యతతో వ్యాఖ్యానించడం; లేదా, రెండు: ఆ సిస్టమ్‌కి ఔట్‌సైడర్‌గా, పరాయిగా కలోనియల్ కంటితో, జాత్యహంకారపు బూతద్దాలతో చూస్తూ ఆ అశుభ్రాన్ని వేళాకోళం చేయడం. నేషనల్ రిపోర్ట్ వెబ్ సైట్ కచ్చితంగా ఎంచుకుంది ఈ రెండవ మార్గాన్నే. ఇండియాలో రేప్ ఉదంతాలు పెచ్చరిల్లి పోతున్నాయని, కొన్ని మరీ పైశాచికంగా ఉన్నాయని చెప్పడానికి ఎందరో భారతీయుల్ని క్షోభ పెట్టవల్సిన పనిలేదు. అంతర్జాతీయంగా రేప్‌లకు రాజధాని అమెరికా అని మర్చిపోయి ఎదుటివారి లోపాల్ని ఎంచడానికి తెగబడకూడదు. గన్ కల్చర్ మొదలుకొని, చీకటి సామ్రాజ్యంలో ఉన్న తీవ్రాతి తీవ్రమైన నేరాలకి కేంద్రమైన అమెరికాలోని మీడియా గురివిందగింజలా తన కింద నలుపు గుర్తించకపోవడం కండకావరమే. ఒక గొప్ప సంప్రదాయానికి నిబద్ధమైన ప్రతీకలైన నాగా సాధువుల ఫొటోని ఈ తప్పుడు కథనానికి వాడటం, మితిమీరిన మిడిసిపాటుతో ఆ వార్త ప్రచురించడం కోట్లాది మంది భారతీయుల్ని వేదనకి గురిచేసింది. అసోం ప్రభుత్వం పరువు నష్టం దావా వేసే ఆలోచనతో ఉండగా, భారత ప్రభుత్వం దీనినొక సైబర్ నేరంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది.

తమిళనాడులోని బాలకిషన్ అనే మహా రేపిస్టు స్ఫూర్తిగానే క్రీస్తుపూర్వం 43 నుంచి అస్సోం రేప్ ఫెస్టివల్‌ ప్రతి ఏటా జరుగుతుందని ఆ వెక్కిరింతల వార్తాకథనంలో రాయడం జాతివివక్షకి మించిన హేయమైన నేరం.

>
మరిన్ని వార్తలు