ఈసారి సూచనలతో రండి: కృష్ణా ట్రిబ్యునల్

3 Aug, 2013 02:48 IST|Sakshi

నీటి కేటాయింపుల వాడకానికి సంబంధించి తాము ప్రతిపాదించిన పరిష్కారాన్ని, దానికి ప్రత్యామ్నాయాన్ని అంగీకరించనందున.. సదరు ఫార్ములా విషయంలో గట్టి సూచనలతో రావాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలను కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ ఆదేశించింది. ‘‘మేం చెప్పినదానిపై మీరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మార్చమని కోరుతున్నారు. అందువల్ల మూడు రాష్ట్రాలూ కలిసి చర్చించుకుని.. జలాల వాడకం పద్ధతిపై తగిన సూచనలను అందజేయండి. వాటిని పరిశీలించి నిర్ణయిస్తాం’’ అని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రజేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఇందుకు మూడు రాష్ట్రాలు సమ్మతించడంతో ట్రిబ్యునల్ తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు. ‘భిన్న డిపెండబులిటీ శాతాల వద్ద జలాల వాడకం పద్ధతి’పై తాజా విచారణ సందర్భంగా మూడు రాష్ట్రాలకు ట్రిబ్యునల్ అందజేసిన నోట్‌లో ప్రతిపాదించిన ఫార్ములాకు కర్ణాటక, మహారాష్ట్ర ససేమిరా అనగా.. ఆంధ్రప్రదేశ్ కొన్ని వెసులుబాట్లు కోరింది.
 
  దీంతో పరిష్కారాన్ని సూచించే భారాన్ని ట్రిబ్యునల్ మూడు రాష్ట్రాలపైనే వేసింది. ఫలితంగా ఈ నెల 24, 25న మూడు రాష్ట్రాల న్యాయవాదులు జలవాడకం ఫార్ములాపై చర్చించి సూచనలు సిద్ధంచేసి 26న విచారణ పునఃప్రారంభమైనప్పుడు ట్రిబ్యునల్‌కు అందజేయాల్సి ఉంటుంది. జస్టిస్ బ్రజేష్‌కుమార్ సారథిగా, జస్టిస్ దిలీప్‌కుమార్ సేఠ్, జస్టిస్ బి.పి.దాస్ సభ్యులుగా ఉన్న ట్రిబ్యునల్ వరుసగా ఐదవరోజు శుక్రవారం కూడా విచారణ జరిపింది. తొలుత ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపించింది. అనంతరం మహారాష్ట్ర తరఫున న్యాయవాది అంద్యార్జున మాట్లాడుతూ.. ఫార్ములాలో మార్పులకు పట్టుబట్టారు. ట్రిబ్యునల్ ప్రతిపాదించిన పరిష్కారం నిజానికి వాడకం ఆధారిత ఫార్ములా అని, దీన్ని అమలుచేస్తే వివాదాలకు దారితీస్తుందని చెప్పారు. ఈ సందేహాలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. అన్నికోణాల నుంచి ఆలోచించాకే పరిష్కారం, ప్రత్యామ్నాయంతో ముందుకొచ్చామని, వీటిలో దేన్ని చేపట్టినా ఎవరికీ నష్టం కలగదని స్పష్టంచేసింది. అయినా.. మహారాష్ట్ర, కర్ణాటక ఫార్ములాలో మార్పులకోసమే పట్టుబట్టాయి.
 
 న్యాయం చేయాలని రాష్ట్రం విన్నపం: అంతకుముందు ఆంధ్రప్రదేశ్ తరఫున  న్యాయవాది డి.సుదర్శన్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. కర్ణాటక, మహారాష్ట్ర జలాల లెక్కల్లో అవకతవకలకు పాల్పడుతున్నాయని, ట్రిబ్యునల్ నిర్ణయంలో పలు అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, దీన్ని సరిదిద్దాలని విన్నవించారు. కాగా.. ఒకచోట  కేటాయించిన జలాలను మరోచోటకు మళ్లించడానికి అనుమతించే ‘వాటర్ స్వాపిం గ్’ పద్ధతి కింద మహారాష్ట్ర మరో దగాకు సిద్ధమైంది. తమకు కేటాయించిన కొన్ని జలాలను వేరేచోట వాడుకోవడానికి ఇచ్చిన అనుమతి పరిధిలోకి మరిన్ని ప్రాజెక్టులను చేర్చాలని కోరింది. అయితే.. దీనిపై ఆలోచిస్తామని ట్రిబ్యునల్ పేర్కొంది.

మరిన్ని వార్తలు