యువత నైపుణ్యతకు ఐసీఐసీఐ బ్యాంక్ అకాడమీ

5 Oct, 2013 03:40 IST|Sakshi
యువత నైపుణ్యతకు ఐసీఐసీఐ బ్యాంక్ అకాడమీ

 జైపూర్: యువతలో నైపుణ్యతను పెంపొందించడానికి ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ శుక్రవారం ఇక్కడ ఒక అకాడమీని ప్రారంభించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతల్లో (సీఎస్‌ఆర్) భాగంగా  ఈ అకాడమీకి రూపకల్పన చేసింది. సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాల యువతకు వృత్తి విద్యా  శిక్షణా అవకాశాలను కల్పించడం లక్ష్యంగా ఈ అకాడమీ పనిచేస్తుంది. బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్  చందా కొచర్ ఈ అకాడమీని ప్రారంభించారు.
 
 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారత్ సమ్మిళిత వృద్ధిలో భాగంగా దేశ వ్యాప్తంగా తొమ్మిది శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏర్పాటు చేసిన తొలియేడాదే 5 వేల మందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నది లక్ష్యమని తెలిపారు. 2016 నాటికి దేశ వ్యాప్తంగా 15,000 మందికి శిక్షణా అవకాశాలు కల్పించాలన్నది ధ్యేయమని వెల్లడించారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్ వంటి పట్టణాల్లో ఈ శిక్షణా అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బ్యాంకుకు తగిన నగదు లభ్యత (లిక్విడిటీ) ప్రస్తుతం ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు