సీడబ్ల్యూసీ తీర్మానానికే కట్టుబడండి

6 Dec, 2013 03:16 IST|Sakshi
సీడబ్ల్యూసీ తీర్మానానికే కట్టుబడండి

ప్రధానిని కోరిన టీ కాంగ్రెస్ ఎంపీలు
 పది జిల్లాల తెలంగాణకే కట్టుబడి ఉన్నాం: టి. జేఏసీతో సుష్మా

 
 సాక్షి, న్యూఢిల్లీ: మంత్రుల బృందం(జీవోఎం) రాయల తెలంగాణకు సిఫార్సు చేసిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సురేష్ శెట్కార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజయ్య, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానికి ఓ మెమొరాండాన్ని సమర్పించారు.
 
 రాయల తెలంగాణ వల్ల పార్టీకి ఒనగూరే ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదని, కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కారం అవుతుందన్న వాదన సరికాదని చెప్పినట్లుగా సమాచారం. సీడబ్ల్యూసీ తీర్మానానికి కట్టుబడి పదిజిల్లాల తెలంగాణకే కేబినెట్‌లో ఆమోదం తెలపాలని ప్రధానికి విన్నవించారు. తమ విజ్ఞప్తిపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఎంపీలు తెలిపారు. అంతకుముందు వారు అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు ప్రయత్నం చేసినా వీలుపడకపోవడంతో దూరం నుంచే ఆమెకు నమస్కరించి వెళ్లిపోయారు.
 
రాయల తెలంగాణకు ఒప్పుకోం
సుష్మా రాయల తెలంగాణకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ తెలంగాణ జేఏసీ నేతలకు స్పష్టం చేశారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణకే కట్టుబడి ఉంటామని ఆమె తెలిపారు. గురువారం జేఏసీ నేతలు కోదండరాం, దేవీప్రసాద్, విఠల్, శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, అద్దంకి దయాకర్, అమిద్ మహ్మద్ ఖాన్‌లు పార్లమెంట్‌లోని బీజేపీ కార్యాలయంలో సుష్మాను కలసి వినతిపత్రాన్ని అందజేశారు.
 
రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఈ సందర్భంగా నేతలు ఆమెను కోరారు. ప్రజలు కోరుకున్న తెలంగాణకే తమ మద్దతు ఉంటుందని సుష్మా చెప్పారని జేఏసీ నేతలు తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ఆమె స్పష్టం చేసినట్లు జేఏసీ నేతలు చెప్పారు. ఈ సందర్భంగానే కొందరు నేతలు ఆమెను తెలంగాణ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయాలని, భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నపుడు.. బీజేపీ గెలుస్తుందంటే ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటా, పరిశీలిస్తాం అని నవ్వుతూ సమాధానం ఇచ్చినట్లు జేఏసీ నేతలు చెప్పారు. అనంతరం టీ జేఏసీ నేతలు కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ను కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు.
 
గాంధీ విగ్రహం వద్ద వివేక్, వినోద్ బైఠాయింపు
రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఎంపీ వివేక్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బైఠాయించారు. సుమారు అరగంటపాటు అక్కడ కూర్చుని రాయల తెలంగాణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు