రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ అనివార్యమా?

16 Jun, 2017 03:15 IST|Sakshi
రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ అనివార్యమా?

న్యూఢిల్లీ: దేశ తదుపరి రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో ఇటు పాలకపక్ష భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే పార్టీలు, అటు ప్రతిపక్ష పార్టీలు పిల్లీ, ఎలుక ఆటకు తెరతీశాయి. ప్రతిపక్ష పార్టీలతో సంప్రతింపులు జరపడం ద్వారా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఖరారు చేసేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్‌ సింగ్, అరుణ్‌ శైరీలతో త్రిసభ్య కమిటీని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.

ఈ కమిటీ ఇప్పటికే కాంగ్రెస్, సీపీఎం, ఎన్‌సీపీ, బీఎస్పీ పార్టీలను సంప్రతించి శుక్రవారం ఆయా పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు సమయాన్ని కోరింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రతిపక్షాలు తమతో కలసి వస్తాయన్న నమ్మకం పాలకపక్షమైన బీజేపీకి ఇసుమంతా కూడా లేదు. కేవలం కాలయాపన చేయడానికి ఈ తతంగం, ఈ కసరత్తు అంతా కూడా. రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేయాల్సిన ఆఖరి తేదీ జూన్‌ 28వ తేదీకాగా ఎన్నికలు జూలై 17వ తేదీ. చివరి వరకు ప్రతిపక్షాలను సరైన అభ్యర్థి ఎన్నుకోకుండా ఏదోరకంగా వారిని ఎంగేజ్‌ చేయడం బీజేపీ వ్యూహం.

గోపాలకృష్ణ గాంధీ పేరు...
ప్రతిపక్ష నాయకులేమీ అమాయకులు కాదు కసరత్తు మానేసి కాలయాపన చేయడానికి. ప్రతిపక్షాలకు చెందిన పది మంది సభ్యుల కమిటీ బుధవారం సమావేశమై తమ పక్షం నుంచి రాష్ట్రపతి అభ్యర్థికి పలువురి పేర్లను పరిశీలించింది. జాతిపిత మహాత్మాగాంధీ మనుమడు, సీ రాజగోపాలచారి బంధువు, పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్, రిటైర్డ్‌ ఉన్నతాధికారి గోపాల కృష్ణ గాంధీ అభ్యర్థిత్వం పట్ల ప్రతిపక్షంలో ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉంది. జాతిపితను ఇప్పటికే ‘చతుర్‌ బనియా’ అంటూ విమర్శించిన అమిత్‌ షా ప్రతిపక్షంతో కలసివచ్చే అవకాశం ఏమాత్రం లేదు. లౌకిక భావాలు కలిగిన వ్యక్తిని తప్పా మరొకరి పేరును పాలకపక్షం ప్రతిపాదిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని లలూ ప్రసాద్‌ యాదవ్‌ స్పష్టం చేయడం, ఆ మాటకు వామపక్షలు మద్దతు పలకడం తెల్సిందే. మరో లౌకిక అభ్యర్థిని పాలకపక్షం ప్రతిపాదించడంగానీ, ప్రతిపక్షం ప్రతిపాదిస్తే అంగీకరించేందుకు బీజేపీ సిద్ధంగా లేదు.

ఎవరి స్క్రిప్టు వారిదే...
పాలకపక్షానికి తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన ఓట్లు ఉన్నాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీఆర్‌ఎస్‌ పార్టీలతోపాడు తమిళనాడులోని అన్నాడీఎంకే వర్గాలు తమకు మద్దతిస్తాయని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఒరిస్సాలో అధికారంలో ఉన్న బీజూ జనతాదళ్‌ పార్టీ బీజేపీవైపు మొగ్గు చూపకుండా ఉండేందుకు ప్రతిపక్షాలు ఇప్పటికే ఆయనతో టచ్‌లో ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ప్రతిపక్షం కలసిరాకుండా పోటీకి సిద్ధమైనందున తాము పోటీకి సిద్ధపడాల్సి వచ్చిందని పాలకపక్షం బీజేపీ,  పాలకపక్షం ప్రతిపాదించిన అభ్యర్థి తమకు నచ్చకపోవడం వల్ల పోటీ అనివార్యమైందని ప్రతిపక్షం అంతిమంగా చెప్పేది. మరి ఇరువర్గాల నుంచి ఈ కసరత్తు ఎందుకు? 2019 సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా రాష్ట్రపతి ఎన్నికల పేరిట ప్రతిపక్షాలను కూడగట్టడం కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంకాగా, రాష్ట్రపతి ఎన్నికల్లోనే ప్రతిపక్షాలను ఘోరంగా చిత్తు చేయడం ద్వారా వారి భవిష్యత్తు ప్రణాళికలను తుంచివేయడం బీజేపీ రాసుకున్న స్రిప్టు.

ఏకగ్రీవంగా నీలం ఒక్కరే...
ఆ మాటకొస్తే 1977లో నీలం సంజీవ రెడ్డిని మినహాయిస్తే ఇంతవరకు ఏ రాష్ట్రపతి కూడా ఏకగ్రీంగా ఎన్నికకాలేదు. వాస్తవానికి నీలం సంజీవరెడ్డిని జనతా పార్టీ ప్రతిపాదించగా ఆ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినందున నీలంను కాంగ్రెస్‌ పార్టీ సమర్థించాల్సి వచ్చింది. 2002లో అప్పటి ప్రధాన మంత్రి అటల్‌ బిహారి వాజపేయి, రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు. కలాం అభ్యర్థిత్వానికి కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు మద్దతిచ్చినా, వామపక్షాలు కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ను నిలబెట్టాయి. అలాగే ప్రతిభాపాటిల్, ప్రణబ్‌ ముఖర్జీ విషయంలో కాంగ్రెస్‌ కూడా శివసేన. జేడీయూ లాంటి పార్టీల మద్దతును కూడగట్టాయి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ప్రణబ్‌ ముఖర్జీ పేరునే పాలకపక్షం ప్రతిపాదిస్తే పరిస్థితి వేరుగా ఉండవచ్చు. దేశ చరిత్రలో తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ మాత్రమే రెండు సార్లు పోటీ చేసి, రెండు సార్లు విజయం సాధించారు.

 

>
మరిన్ని వార్తలు