గ్రూప్-1కు మళ్లీ మెయిన్స్

8 Oct, 2013 03:00 IST|Sakshi
గ్రూప్-1కు మళ్లీ మెయిన్స్

ఏపీపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశం
ఇంటర్వ్యూలు కూడా పూర్తయిన 2011 గ్రూప్-1 కేసులో తీర్పు
వివాదాస్పద 6 ప్రశ్నలు తీసేసి మెరిట్ జాబితా రూపొందించండి
దాని ప్రకారం అర్హులకు మెయిన్స్ నిర్వహించాలంటూ ఉత్తర్వులు


 సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-1 వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ప్రిలిమ్స్, మెయిన్స్‌తోపాటు ఇంటర్వ్యూలు కూడా పూర్తయిన 2011-నోటిఫికేషన్‌లోని 314 పోస్టులకు.. ఇపుడు మళ్లీ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలోని వివాదాస్పద ప్రశ్నలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసును సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. వివాదాస్పద ఆరు ప్రశ్నలను తొలగించి మిగిలిన ప్రశ్నలకు లభించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను కొత్తగా రూపొందించాలని సుప్రీంకోర్టు ఏపీపీఎస్సీని ఆదేశించింది. అంతేకాదు, ఆ మెరిట్ జాబితాను అనుసరించి అర్హులకు మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కూడా ఉత్తర్వులిచ్చింది.  జస్టిస్ హెచ్.ఎల్.గోఖలే, జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు కేసును పరిష్కరిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీనిపై కమిషన్ వర్గాలను సంప్రదించగా.. కోర్టు తీర్పు కాపీ అందాక పరిశీలించి, కమిషన్‌లో చర్చించి చర్యలు చేపడతామని పేర్కొన్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇంటర్వ్యూలు పూర్తయిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
 
 అసలేం జరిగిందంటే...
 2011 నవంబర్‌లో 314 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ 2012 మే 27న ప్రిలిమ్స్ రాత పరీక్షలు నిర్వహించింది. వాటి ఫలితాలను జూన్ 13న ప్రకటించింది. ఇందులో 1:50 చొప్పున 16,426 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది. అయితే పలువురు అభ్యర్థులు ఇందులో కటాఫ్ మార్కులు తెలియజేయాలని, కీని ప్రకటించాలని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఆగస్టు 31న ఏపీపీఎస్సీ కీని ప్రకటించింది. ఆ కీలో తప్పులు దొర్లాయని, 13 ప్రశ్నలకు తప్పుడు సమాధానాలనే ఏపీపీఎస్సీ కీలో సరైనవిగా పేర్కొందని అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా కమిషన్ వర్గాలు మొదట పట్టించుకోలేదు. మెయిన్స్ రాత పరీక్షలకు వారం రోజుల ముందు కమిషన్ వేసిన నిపుణుల కమిటీ 7 తప్పులను మాత్రమే సరిదిద్దింది. దీంతో కటాఫ్ మారింది. మొదట మెయిన్స్‌కు ఎంపిక చేసిన జాబితా నుంచి 845 మంది అభ్యర్థులను తొలగించగా, 1,201 మంది కొత్త వారికి మెయిన్స్ రాసే అవకాశం వచ్చింది. వారంతా ప్రిపేర్ కాకుండానే మెయిన్స్ పరీక్షలు రాయాల్సి వచ్చింది. మరోవైపు అభ్యర్థులు ఎంత మొత్తుకున్నా మిగిలిన ఆరు తప్పులను సరిదిద్దలేదు. 2012 సెప్టెంబర్ 18 నుంచి 28 వరకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్ కేంద్రాల్లో రాత పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు 10 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరు కాగా 606 మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. వారికి గత జనవరి 28 నుంచి మార్చి 22వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది.
 
 అభ్యర్థుల న్యాయపోరాటం..
 మరోవైపు పలువురు అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో దొర్లిన ఆ ఆరు తప్పులను కూడా సరిదిద్దాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు... నాలుగు ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ న్యాయవివాదం జరుగుతుండగానే ఏపీపీఎస్సీ 2011 నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షను, ఇంటర్వ్యూను పూర్తిచేసింది. దీంతో హైకోర్టు తుది ఫలితాల ప్రకటనను నిలుపుదల చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌చేస్తూ ఏపీపీఎస్సీ ఈ ఏడాది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వేసింది. జస్టిస్ గోఖలే, జస్టిస్ చలమేశ్వర్‌ల ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను ఆలకించిన మీదట కేసును పరిష్కరిస్తూ తాజా ఆదేశాలిచ్చింది.

మరిన్ని వార్తలు