బ్రేకింగ్‌: ఔను, రాహుల్‌ ఆయనను కలిశారట!

10 Jul, 2017 16:51 IST|Sakshi
ఔను, రాహుల్‌ ఆయనను కలిశారట!

న్యూఢిల్లీ: చైనా రాయబారితో రాహుల్‌గాంధీ భేటీ అయిన విషయం నిజమే.. ఇది కాంగ్రెస్‌ పార్టీ తాజామాట. మొదట రాహుల్‌గాంధీ, చైనా రాయబారి సమావేశం కాలేదంటూ బుకాయించిన కాంగ్రెస్ సాయంత్రానికి తన మాట మార్చుకుంది. రాహుల్‌ చైనా రాయబారితో భేటీ అయిన విషయం నిజమేనని ధ్రువీకరించింది. సిక్కిం సరిహద్దుల్లో భారత్‌-చైనా సైన్యం మధ్య ఘర్షణాత్మక పరిస్థితుల నేపథ్యంలో చైనా రాయబారి లౌ ఝావోహుయ్‌తో రాహుల్‌ భేటీ అయ్యారని కథనాలు వచ్చాయి.  చైనా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కథనం ప్రచురితం కావడం కలకలం రేపింది. ఈ కథనాన్ని తోసిపుచ్చుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాల ట్వీట్‌ చేశారు. మోదీ భక్తులు ప్రచారం చేస్తున్న ఫేక్‌ న్యూస్‌ ఇదంటూ ఆయన కొట్టిపారేశారు. దీంతో చైనా వెబ్‌సైట్‌ సైతం ఈ కథనాన్ని తొలగించింది.

ఈ వివాదం కొనసాగుతుండగానే రణ్‌దీప్‌ సూర్జేవాల మాట మార్చారు. రాహుల్‌ చైనా రాయబారితోపాటు భుటాన్‌ రాయబారి, జాతీయ భద్రత మాజీ సలహాదారు శివశంకర్‌ మీనన్‌తో భేటీ అయ్యారని చెప్పారు. వివిధ దేశాల రాయబారులు, అంబాసిడర్‌లు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడిని తరచూ కలువడం సాధారణ విషయమేనని చెప్పారు. సరిహద్దుల్లో భారత్‌-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభనపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని రాహుల్‌ గాంధీ ఇప్పటికే ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు