మళ్లీ రాయల తెలంగాణ !

30 Nov, 2013 06:42 IST|Sakshi
మళ్లీ రాయల తెలంగాణ !

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం మరోసారి రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకు తెస్తోంది. రా్రష్ట్ర విభజన విధివిధానాల ఖరారుకు ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం) తన పూర్తిస్థాయి సమావేశాల అనంతరం రాయల తెలంగాణకు ఆస్కారం లేదని సంకేతాలు పంపినా, శుక్రవారం నాటి పరిణామాలు మాత్రం ఆ దిశగా అధిష్టానం ఆలోచనలు ఇంకా ముగియలేదని స్పష్టం చేస్తున్నారుు. కొన్నాళ్లుగా రాష్ట్ర విభజన అంశంపై నానా రకాలుగా ప్రజలను గందరగోళ పరుస్తున్న జీవోఎం, కాంగ్రెస్ ఢిల్లీ నేతలు తాజాగా రాయలసీమను విభజించే ఆలోచనకు పదును పెట్టారు.
 
 అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు కాంగ్రెస్ మంత్రులు మినహా రాయల తెలంగాణ ఎవరూ కోరుకోవడం లేదు. పైగా గడిచిన నాలుగు నెలలుగా కసరత్తు చేస్తున్న జీవోఎంకు కూడా రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ వేలాదిగా వినతులు అందాయి. ఒకదశలో రాయల తెలంగాణ లేదని లీకులివ్వడమే కాకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయానికి అనుగుణంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే ఖాయమంటూ చెప్పుకొచ్చారు.
 
 ఆ మేరకు జీవోఎం ప్రతిపాదనలు కూడా పూర్తయ్యాయనీ రెండు మూడురోజుల్లో కేబినెట్ ముందుకు వెళుతుందని చెబుతున్న ఈ చివరి నిమిషంలో మళ్లీ రాయల తెలంగాణ అంశాన్ని లేవనెత్తడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. విభజన బిల్లు శాసనసభకు వెళ్లినప్పుడు మెజారిటీ అభిప్రాయం విభజనకు అనుకూలంగా ఉందని చెప్పే ఎత్తుగడలో భాగంగానే ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర విభజనను కొబ్బరికాయను కొట్టినట్టు రెండు సమాన భాగాలుగా పగలగొట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూత్రీకరించారు. ఆ మార్గంలోనే కృష్ణా జలాల వివాదం పేరిట లోక్‌సభ, శాసనసభ సీట్లను సమంగా పంచాలన్న ఆలోచనను కాంగ్రెస్ మరోసారి తెరమీదకు తెస్తోందని ఆ మేరకు సంప్రదింపులు జరుపుతోందని అంటున్నారు. శుక్రవారం జీవోఎం సభ్యుడు జైరామ్ రమేశ్ రా్రష్ట్ర కాంగ్రెస్  వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యూరు.
 
 భవిష్యత్తులో కృష్ణా నదీ జలాల వివాదం తలెత్తకుండా ఉండాలంటే రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపాలని సూచించారు. అదే సమయంలో ఇరు ప్రాంతాలకు సమానంగా పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు ఉంటాయని వివరించారు. దీనిపై తెలంగాణ నేతల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలని కోరారు. జైరామ్ సమక్షంలోనే దిగ్విజయ్ ఢిల్లీలోనే ఉన్న డిప్యూటీ సీఎం దామోదరకు ఫోన్ చేశారు. రాయల తెలంగాణపై దామోదర స్పందిస్తూ.. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షకు, సీడబ్ల్యూసీ తీర్మానానికి రాయల తెలంగాణ పూర్తిగా విరుద్ధం. దీనివల్ల రాజకీయంగా ఎలాంటి లబ్ధి చేకూరకపోగా నష్టమే ఉంటుంది’ అని వారితో అన్నారు.  తర్వాత సాయంత్రం డిప్యూటీ సీఎం నేరుగా దిగ్విజయ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాయల తెలంగాణపై తెలంగాణ ప్రాంత నేతల అభిప్రాయాలను మరోమారు ఆయన ముందుంచారు.
 
 పది జిల్లాల తెలంగాణే కావాలి: దామోదర
 దిగ్విజయ్‌తో భేటీ అనంతరం దామోదర మీడియాతో మాట్లాడుతూ ‘తాము పది జిల్లాల తెలంగాణే కోరుకుంటున్నామని తెలిపారు. రెండు జిల్లాలను కలుపుతారనే వార్తలు వస్తున్నాయనగా,‘వారు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. చర్చలు జరుగుతున్నాయి’ అంటూ క్లుప్తంగా మాట్లాడారు. ఇలావుండగా కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, జైరాం రమేశ్‌లు సైతం కీలకమైన కోర్‌కమిటీ సమావేశానికి ముందు పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమై రాయల తెలంగాణపై తమ అభిప్రాయాన్ని ఆమె ముందుంచినట్లుగా తెలిసింది. అరుుతే నాలుగు జిల్లాలతో కూడిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక అస్థిత్వం ఉందని, కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ అస్థిత్వాన్ని దెబ్బతీయాలను చూడటమేంటని ఆ ప్రాంత నేతలు మండిపడుతున్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు