పెద్దాయనా.. ఇదేం పని?

9 May, 2017 09:20 IST|Sakshi
పెద్దాయనా.. ఇదేం పని?

ములాయంపై కాంగ్రెస్, బీజేపీ మండిపాటు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఓటమికి కాంగ్రెస్‌ పార్టీతో పొత్తే కారణమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ తిప్పికొట్టింది. ములాయం మాటలకు చేతలకు పొంతనే లేదని పేర్కొంది. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఐక్య కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేసినప్పుడల్లా ములాయం దూరంగా వెళ్లారని గుర్తు చేసింది. అలాగే ములాయం కుటుంబంలో తలెత్తిన సంక్షోభం ప్రజల వరకు చేరకుండా, ఇరు వర్గాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని ఉండాల్సిందని యూపీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అశోక్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. యూపీలో ఓటమికి కాంగ్రెస్‌తో పొత్తే కారణమని ములాయం చేసిన వ్యాఖ్యలు నిరాధారమని కొట్టిపారేశారు.

కాగా, ప్రధాని మోదీపై ములాయం సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. యూపీ ప్రజల తీర్పును ఆయన అగౌరవపరుస్తున్నారని పేర్కొంది. ములాయం ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించింది. తన కుమారుడే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టిన తీరుతో ఆయన ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నారని, ఆయన వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించలేదని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి మనీశ్‌శుక్లా పేర్కొన్నారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ రూ.15వేలు కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని ములాయం విమర్శించిన విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు