రాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటనపై అసహనం

19 Jun, 2017 16:11 IST|Sakshi
రాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటనపై అసహనం

- రామ్‌నాథ్‌కు మద్దతుపై ఇప్పుడే చెప్పలేం: కాంగ్రెస్‌ నేత ఆజాద్‌

న్యూఢిల్లీ:
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ఇచ్చేది లేనిది ఇప్పుడే చెప్పబోమని ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. రామ్‌నాథ్‌ అభ్యర్థిత్వంపై తక్షణమే స్పందించబోమని రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్డీఏ తన అభ్యర్థి పేరును ప్రకటించిన తీరుపై ఒకింత అసహనం వెళ్లగక్కారు.

‘రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించడానికి ముందు మమ్మల్ని(విపక్షాన్ని) సంప్రదిస్తామని బీజేపీ చెప్పింది. సోనియా గాంధీతో బీజేపీ త్రిసభ్య కమిటీ భేటీ జరిగినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ చెప్పినదానికి విరుద్ధంగా.. ఏకపక్షంగా పేరును వెల్లడించారు’ అని గులాం నబీ ఆజాద్‌ చెప్పారు.

రామ్‌నాథ్‌ కోవింద్‌కు పోటీగా ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి నిలపాలా లేదా అనే దానిపై రెండు రోజుల్లో జరగనున్న సమావేశంలో విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రస్తుత బిహార్‌ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత అయిన రామ్‌నాథ్ కోవింద్‌ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవింద్‌ స్వస్థలం యూపీలోని కాన్పూర్‌.

 

మరిన్ని వార్తలు