చెప్పిందేంటి? చేస్తున్నదేంటి?

21 Oct, 2015 03:57 IST|Sakshi
చెప్పిందేంటి? చేస్తున్నదేంటి?

- సీఎం కేసీఆర్‌కు దిగ్విజయ్ సూటి ప్రశ్న
- ఆత్మహత్యల నివారణలో టీఆర్‌ఎస్ వైఫల్యం
- మతం తప్ప బీజేపీకి అభివృద్ధి పట్టడం లేదు
 
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలేంటి, ఇప్పుడు ఆచరణలో చేస్తున్నదేంటి అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆరోపించారు. రైతుల్లో భరోసా కల్పించి, ఆత్మహత్యలను అరికట్టడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని మండిపడ్డారు. దిగ్విజయ్ మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, అనిల్‌కుమార్ గౌడ్‌తో కలసి గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వ విధానంతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని, రైతులు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణలో నిజాం నియంతృత్వ పాలనను తిరిగి తెస్తున్నారని దుయ్యబట్టారు. వరంగల్ జిల్లాలో శ్రుతిని అమానవీయంగా ఎన్‌కౌంటర్ పేరిట, చిత్రహింసలు పెట్టి కాల్చిచంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 ముస్లిం యువకులను కూడా కాల్చిచంపారని, ఇలాంటి బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని దిగ్విజయ్ విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫమైందన్నారు. మతం పేరిట, గోమాంసం పేరిట ఆర్‌ఎస్‌ఎస్, శివసేన ఆగడాలు మితిమీరిపోయాయని, అయినా ప్రధాని మోదీ ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి తెప్పిస్తానని, ప్రతీ వారికి బ్యాంకు ఖాతాలో 15 లక్షలు వేస్తామని ఇచ్చిన హామీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మతం పేరిట రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని దిగ్విజయ్ ఆరోపించారు. మతం తప్ప బీజేపీకి అభివృద్ధి పట్టడం లేదని ధ్వజమెత్తారు.
 
 హోదా గురించి మోదీని ఎందుకు అడగరు?
 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా గురించి ప్రధానమంత్రి మోదీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అడగడం లేదని దిగ్విజయ్‌సింగ్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నోరెందుకు విప్పడం లేదన్నారు. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన కోసం వస్తున్న మోదీ విభజన బిల్లులోని హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కూడా మోదీ లాగానే హామీలు ఇచ్చి అమలుచేయకుండా మర్చిపోయారని ఎద్దేవా చేశారు. బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా దిగ్విజయ్ చెప్పారు.

మరిన్ని వార్తలు