రాహుల్‌కు ఈ ఏడాదే కాంగ్రెస్ పగ్గాలు!

26 Feb, 2015 01:47 IST|Sakshi
రాహుల్‌కు ఈ ఏడాదే కాంగ్రెస్ పగ్గాలు!

 న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అకస్మాత్తుగా పార్టీ భవిష్యత్ గమనంపై ఆలోచించడానికి సెలవు తీసుకోవటమనేది.. ఆయనకు పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు అప్పగించేందుకు మొదలైన కసరత్తుకు ఉపోద్ఘాతం కావచ్చని చెప్తున్నారు. పార్టీ చీఫ్ సోనియాగాంధీ పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముగియనున్న నేపథ్యంలో.. ఆమె కుమారుడు రాహుల్ ను ఈ ఏడాదే పార్టీ అధ్యక్షుడిగా చేయనున్నారని భావిస్తున్నారు.

అయితే.. ఏప్రిల్‌లో జరగబోయే ఏఐసీసీ సదస్సులోనే రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా? లేదా? అనేది స్పష్టం కాలేదు. కానీ రాహుల్ ఈ ఏడాదే పార్టీ అధ్యక్షుడయ్యే అవకాశాలను కాంగ్రెస్ వర్గాలు కొట్టివేయలేదు. సోనియా 1998 నుంచీ కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాహుల్‌ను 2013 జనవరిలో జైపూర్‌లో జరిగిన చింతన్ శిబిరంలో పార్టీ ఉపాధ్యక్ష పదవిలో నియమించిన విషయం విదితమే.
 
 రాహుల్ పారిపోవటం లేదు: దిగ్విజయ్
 రాహుల్  రాజకీయాల నుంచి పారిపోవచ్చన్న ఊహాగానాలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ కొట్టివేశారు. రాహుల్ బలమైన వ్యక్తిత్వం గలవాడని.. ఆయన పార్టీ సారథ్యం వహించేందుకు తిరిగి వస్తారని పేర్కొన్నారు. రాహుల్ అకస్మాత్తుగా రాజకీయ వేదిక నుంచి అదృశ్యమై సెలవుపై వెళ్లడంతో.. ఆయన ఇక ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేని పరిస్థితుల్లో రాజకీయాలకు ఉద్వాసన పలకనున్నారంటూ ఊహాగానాలు వస్తున్నాయని హెడ్‌లైన్స్ టుడే టీవీ చానల్ ప్రతినిధి కరణ్‌థాపర్ అడిగిన ప్రశ్నలకు దిగ్విజయ్ పై విధంగా స్పందించారు. రాహుల్, సోనియాల మధ్య విభేదాలు లేవన్నారు.
 
 

మరిన్ని వార్తలు