ప్రశ్నిస్తే మీదపడి కరుస్తున్నారు...: సీఆర్

25 Jun, 2016 14:24 IST|Sakshi
ప్రశ్నిస్తే మీదపడి కరుస్తున్నారు...: సీఆర్

హైదరాబాద్ : ఏపీ రాజధాని నిర్మాణంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఆయన శనివారం ఇందిరాభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి ప్రజా అమరావతి కాదని రైతుల దగ్గర చంద్రబాబు భూములు లాక్కున్నారు. తనకు నచ్చినవారికి భూములు కట్టబెడుతున్నారు. రాజధాని సెంటిమెంట్ను దోపిడీకి అనుకూలంగా మలచుకుంటున్నారు.స్విస్ ఛాలెంజ్ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలను ఏమాత్రం సంప్రదించడం లేదన్నారు.రాజరికంలో కూడా ఇలా జరిగి ఉండదన్నారు.

విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన చంద్రబాబు... ప్రశ్నిస్తే వారిపై పడి కరవడం చేస్తున్నారని సి.రామచంద్రయ్య విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా వ్యవహరించడం సరికాదన్నారు. మీడియాను నియంత్రించాలని చంద్రబాబు చూస్తున్నారని, అలా ఎన్నింటిపై నిషేధం విధిస్తారని ప్రశ్నించారు. ఏదో ఒకరోజు ప్రజలు నిన్ను, నీ పార్టీని బ్యాన్ చేస్తారంటూ చంద్రబాబుపై రామచంద్రయ్య నిప్పులు చెరిగారు.   అధికారపక్షానికి, ప్రధాన ప్రతిపక్షానికి కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే తేడా ఉందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.

రాజధాని నిర్మాణంలో ఉల్లంఘనలు లేవని సర్టిఫికెట్ ఆయనకు ఆయనే ఇచ్చుకుంటున్నారన్నారు. ప్రపంచంలోనే అభ్యంతరకరమైన పద్ధతిని భారతదేశంలో అమలు చేస్తామనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన రహస్య ఎజెండాను పక్కనపెట్టాలని సీఆర్ సూచించారు. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్న ప్రాజెక్ట్ అని, వెంటనే గ్లోబల్ టెండర్లు పిలవాలన్నారు.  ఎవరూ అర్హులు అయితే వాళ్లకే నిర్మాణ బాధ్యతలు అప్పగించాలన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు 45 రోజుల సమయం ఇస్తున్నామని అన్నారు. ప్రపంచంలో తానే తెలివైనవాడిననే భ్రమలో చంద్రబాబు ఉన్నారని, దాంతో రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని సీఆర్ వ్యాఖ్యానించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే అమ్మేశారని ఆయన మండిపడ్డారు.

మరిన్ని వార్తలు